Kalinga Times,Hyderabad : శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వర లక్ష్మి పూజలను ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొంటారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్ట,ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కుటుబంలో శాంతి,సౌభాగ్యాలతో పాటు ప్రేమ, కీర్తి, సంతోషం లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి.
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి.
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజను చేయాలి.
శుచి,శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.మహా లక్ష్మి దేవిని ఏకాగ్రతతో ధ్యానిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబం మొత్తం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని స్వయంగా పరమెశ్వరుడే పార్వతీ దేవికి తెలియ జేసినందు వల్ల ఈ వర లక్ష్మి వ్రత ప్రాధాన్యతను తెలుసుకొని అనాదిగా శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవి ఆరాధిస్తూ వస్తున్నారు.