Religious
స్వయంభూగా వెలసిన మంథని శ్రీ మహాలక్ష్మి
మంథని: భక్తుల కొర్కెలను తీర్చే కొంగుబంగారు తల్లి మహా మహిమాన్వితమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని పవిత్ర గోదావరినదీ తీరంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలను తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతుంది. భారతదేశంలో శ్రీ మహాలక్ష్మి దేవాలయాలు అరుదుగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహారాష్ట్రలోని కొల్లాహాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం కాగా ముంబాయి మహలక్ష్మి సముద్రం ఒడ్డున కొలువుదీరి ఉంది అయితే మహాలక్ష్మి అమ్మవారు కమలాల కొలను ముంగిట కొలువుదీరి ఉండటం మంథని మహాలక్ష్మి అమ్మవారు ఉండటం ఎంతో విశిష్టత సంతరించుకుంది.
మంథనిలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నాటినుండి నేటివరకు నిత్యం ఆరాదన, పూజలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్వయంభూ దేవాలయంల కేవలం మంథనిలో ఉండటం విశేషం. ఈ మద్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు మంథనిలో ప్రవచనం సందర్భంగా మంథనిలోని దేవాలయాలన్ని సందర్శించారు. దీనిలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వైభవాన్ని చూసి మంత్రముగ్దులైపోయారు. అంతేకాకుండా దాదాపు సందర్భం వచ్చినప్పుడల్లా తన ప్రవచనంలో మంథని శ్రీ మహాలక్ష్మి దేవాలయం యొక్క విశిష్టతను చెప్పటంతో దేశంలోని అనేక ప్రాంతాలనుండి భక్తులు తండోపతండాలుగా నిత్యం అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
కాగా ముఖ్యంగా గోదావరిపుష్కరాల్ల్లో భాగంగా లక్షల సంఖ్యలో భక్తులు ప్రత్యేకంగా ఆంద్రాప్రాంతానికి చెందిన పలుజిల్లాల భక్తులు మంథని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పుణీతులైనారు. విజయదశమి సందర్భంగా మంథని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఎంతో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా 8రోజుల్లో 8రూపాల్లో అలంకరణ చేస్తారు. ముఖ్యంగా అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించిన సందర్భంగా వేలాది మంది దర్శించుకుంటారు. నవరాత్రుల్లో 24గంటల పాటు భజనకార్యక్రమం నిర్వహిస్తారు.
అదేవిధంగా ఈ సందర్భంగా త్రికాల చతుషష్టి పూజ, సప్తశతి దేవీభాగవతదేవపారయణం, అఖండ నామసంకీర్తన, దుర్గాజననం, గోపాలకాల్వలు, ప్రతినిత్యం అన్నదానం, 9రోజుల పాటు పాళీలవారిగా నిత్యభజన చేస్తు 9రోజుల పాటు అన్నదానం నిర్వహిస్తారు. ఇవి ఆనాదిగా జరుగుతున్న సంప్రదాయం. అమ్మవారికి ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో పట్టుచీర రవిక పసుపు కుంకుమలతోఒడినింపడటం ఇది సంవత్సరం ముందుగానే బుక్‌చేసుకోవటం విశేషం. ఇదిలా ఉండగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వెనుకాల ఉన్న రావులచెరువుగా పిలువబడే కొలనులో తారకమలాలు మహాలక్ష్మి అమ్మవారిని తలపిస్తాయి.
అమ్మవారు తామరకమలంలో కొలువుదీరి ఉంటుంది అదేవిధంగా మంథనిలో నిత్యం ఈ తారమకమలాలతో అమ్మవారిని అలంకరించి పూజించటం విశేషం. కాగా మంథని శ్రీ మహలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం వసంతపంచమి(సరస్వతి అమ్మవారుజన్మదినం) నాడు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలపైన పడటం ఎంతో విశిష్టత పేర్కొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటానికి హైదరాబాద్‌నుండి 250కిలోమీటర్ల దూరం, కరీంనగర్ నుండి 65కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఇక్కడి రైలు మార్గమున వచ్చే భక్తులు పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్ల నుండి ప్రతి 30నిముషాలకు ఒక ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఇక్కడి నుండి త్రివేణి సంగమం శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి సన్నిధికి చేరుకోవాలంటే 60కిలోమీటర్లు ఉంటుంది. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులు మంథనిలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకుంటారు.