
హైదరాబాద్: తెలంగాణలో ఇకపై కరువు అనేది కన్పించదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతాయని ఆయన చెప్పుకొచ్చారు. గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ కార్యక్రమంలో మాట్లాడారు. రూ.లక్ష రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని ఆయన చెప్పారు. మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నామని ఆవిర్భావ వేడుక సందర్భంగా కేసీఆర్ శుభావార్త చెప్పారు.
నా జీవితాన్ని దారపోస్తాను..!
” రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో సంతోషం నింపింది. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేంద్రానికి కూడా రైతుబంధు ఆదర్శనీయమైంది. రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతుబీమా పెట్టాం. రాష్ట్రంలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. రైతుల తలరాతలు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి. తెలంగాణలో రైతులు ధనవంతులు కావడానికి కృషి చేస్తాను. రైతుల శ్రేయస్సు కోసమే నా జీవితాన్ని దారపోస్తాను. తెలంగాణకు హరితహారం ఎంతో విశిష్టమైనది” అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు..
” నిర్వీర్యమైన స్థానికసంస్థలకు జవసత్వాలు పోస్తాం. పంచాయతీరాజ్ సంస్థలకు నిర్దిష్టమైన నిధులు సమకూరుస్తాం. భవిష్యత్‌లో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉత్పన్నం కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలిస్తాం. గ్రామస్థాయిలో అవినీతి ఉండొద్దు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూశాఖలో అనేక లొసుగులు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. భవిష్యత్తులో గ్రామ పంచాయితీల నిధుల కొరత ఉండదు. రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేయబోతున్నాం. కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించబోతున్నాం. కొత్త రెవెన్యూ చట్టం అమలుకు ప్రజల భాగస్వామ్యం అవసరం. అవినీతికి అడ్డుకట్టవేస్తూ.. పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.