
Kalinga Times : గుంటూరు అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారి ఓ వివాహితపై వల వేశారు. భర్త నుంచి విడాకులు తీసుకొని జీవనోపాధి కోసం ఉద్యోగ వేటలో ఉన్న ఆమె నిస్సహాయతను వాడుకొని, లోబరుచుకొన్నారు. 2 లక్షల రూపాయల డబ్బు కూడా ఆమె నుంచి గుంజారు. ఉద్యోగం మాత్రం ఇప్పించలేదు. ఆయన వల్ల అన్నివిధాల కుంగిపోయిన బాధితురాలు మంగళవారం హోంమంత్రి సుచరితను కలుసుకొని తన గోడు వెళ్లబోసుకొన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ, అటవీ శాఖ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలోని ఈపూరుపాలెం. 2009లో ఆమెకు వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు తన పాపతో కలిసి తన తల్లి వద్ద ఉంటోంది. దీనికోసం ఆమె ఉద్యోగ అన్వేషణ ప్రారంభించింది. గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకొని అక్కడకు వెళ్లింది. పేరేచర్లలోని అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లి జిల్లా అటవీ శాఖ అధికారి మోహనరావును కలిసి తన బయోడేటా, సర్టిఫికెట్లను అందజేసింది. నాలుగు రోజుల తరువాత మోహనరావు ఆమెకు ఫోన్ చేసి తన కార్యాలయానికి రావాలని కోరారు. కార్యాలయానికి వెళ్లి కలవగా, క్లర్క్ ఉద్యోగం ఇస్తానని, దానిని రెగ్యులర్ కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు. దానికిగాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమె నుంచి ఆయన రూ.రెండు లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె ఫోన్ చేయగా, తన స్వభావం బయటపెట్టుకొన్నారు. ‘డబ్బు ఇస్తే చాలదు.. నా కోరిక కూడా తీర్చాలి’ అని షరతు పెట్టారు. గత్యంతరం లేని స్థితిలో ఉన్న ఆమెను లొంగదీసుకొన్నారు. ఆ రోజు నుంచి ఏదో నెపం మీద పిలిపించి, తనను వేధిస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు వాపోయారు. మోహన్‌రావుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆమె కోరారు.