Telangana
లంచం ఇవ్వకుంటే ఉన్న భూమి కూడా పోతుందని…

Kalinga Times,Hyderabad : రెవెన్యూ ఉద్యోగులు చెప్పే మాటలకు భయపడి నయానో భయానో ముట్టజెప్పుతున్నారు జనాలు. ఒకవేళ లంచం ఇవ్వకుంటే ఉన్న భూమి కూడా పోతుందని భయపడి చాలామంది రైతులు వాళ్లు అడిగినంత ఇస్తున్నారనే ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.తాజాగా మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మరో రెవెన్యూ అధికారి లీలలు బయటపడ్డాయి. మడిపెల్లి గ్రామ శివారు సోమారపు కుంట తాండాకు చెందిన ధరావత్ భాస్కర్ అనే రైతు వీఆర్‌వో వెంకటసోములుపై ఆరోపణలు గుప్పించారు. తనకున్న ఎనిమిది ఎకరాల భూమిని పట్టా చేస్తానని నమ్మించి మూడేళ్ల కిందట 26 వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఫైరయ్యారు. అయితే తన భూమిని పట్టా చేయకుండా తిప్పుకున్నారని.. ఆ క్రమంలో వేరే చింతలపెల్లి గ్రామానికి బదిలీ కావడంతో తనను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అయితే బుధవారం నాడు ఎమ్మార్వో ఆఫీసులో సదరు వీఆర్‌వో కనిపించగా అతడిని భాస్కర్ నిలదీశాడు.లంచం తీసుకోవడమే గాకుండా తన పని పెండింగ్‌లో పెట్టావని ఎదురు తిరిగాడు. ఆ వీఆర్‌వో తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నంలో అతడిని బయటకు లాక్కొచ్చాడు. తనకు సమాధానం చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశాడు. అలా మాట్లాడుతున్న క్రమంలో ఇతర రైతులు కూడా జోక్యం చేసుకుని వీఆర్‌వో తీరుపై మండిపడ్డారు. ఒకానొక దశలో వీఆర్‌వోను నెట్టివేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.