Andhra Pradesh
గంటాకు మరింతగా పెరిగిన పట్టు

విజయవాడ, లోకల్ న్యూస్ :విశాఖ జిల్లా రాజకీయాల్లో తన సత్తాను మంత్రి గంటా శ్రీనివాసరావు మరో మారు నిరూపించుకున్నారు. తాజగా నిర్వహించిన ఆయన పుట్టిన రోజు వేడుకలు ఎన్నడూ లేనంత ఘనంగా ఈసారి జరగడం విశేషం. ఎన్నికల ఏడాదిలో గంటా జన్మ దినం రావడంతో విశాఖ జిల్లాకు చెందిన పార్టీ మొత్తం ఆయన ఇంటి ముందు ప్రత్యక్షం కావడం గంటాకు పార్టీపై ఉన్న పట్టు మరో మారు నిరూపితమైంది. గంటాను కలిసి అభినందించేందుకు విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో నేతలు ఈసారి తరలిరావడం గంటా స్థాయి ఏంటో తెలియచేసింది. విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో రేపటి ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే వారంతా గంటా ఇంటి ముందు క్యూ కట్టడం గమనార్హం. గంటా తలచుకుంటే తమకు టికెట్ ఖాయమన్న భావన వారిలో కనిపించింది.
ముఖ్యమంత్రికి ఇటీవల కాలంలో అత్యంత సన్నిహితునిగా మారిన గంటా, బాబు గారి కోటరీలో ఒకరుగా వెలుగుతున్నారు. మంత్రి, సొంత వియ్యంకుడు అయిన నారాయణ చంద్రబాబు కు కుడి
భుజంగా ఉన్న పరిస్థితుల్లొ గంటా మాట చెల్లుబాటు అవుతుందన్న విశ్వాసం విశాఖ నాయకులలో ఎక్కువగా కనిపిస్తోంది. మంత్రిని ప్రసన్నం చేసుకుంటే కాగల కార్యం ఆయనే పూర్తి చేస్తారన్న
ధీమా నేతల్లో ఏర్పడిపోయింది. గంటా విషాయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఏకంగా అర డజన్ టికెట్లను తన ఖాతాలో వేసుకుని చంద్రబాబు నుంచి టికెట్లు దక్కించుకున్నారు.
తనతో పాటు ప్రజారాజ్యం నుంచి నడచిన వారికి ఆ టికెట్లను కట్టబెట్టి జిల్లాలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక మంత్రి కూడా కావడంతో గంటా పరపతి మరింతగా పెరుగుతూ వచ్చింది. ఇక అధినేతతో ఆ మధ్యన వచ్చిన గ్యాప్ ని కూడా పూడ్చుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గంటా మరో మంత్రి చింతకాయల అయ్య్యన్నపాత్రుడు పార్టీలో ధిక్కార స్వరం వినిపించినపుడల్లా బాబుకు అండగా ఉంటూ జిల్లాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. గంటా తన అనుచరులకు టికెట్లు ఇప్పించగలరని పార్టీలోని నాయకులు బలంగా నమ్ముతున్నారు. గంటా పూచీకత్తు తీసుకుని గెలిపించుకువస్తానని చెప్పి మరీ టికెట్లను సాధిస్తున్నారని వారు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక గంటా సామాజికవర్గం ఈసారి పెద్ద ఎత్తున ఆయన జన్మ దిన వేడుకలను నిర్వహించడమే కాకుండా మరిన్ని ఉన్నత పదవులు సాధిచాలని కోరుకోవడం కూడా రాజకీయంగా చర్చగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరో మారు అధికారంలోకి వస్తే గంటా ఉప ముఖ్యమంత్రి కావడంతో పాటు కీలకమైన శాఖలను కూడా నిర్వహిస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.ఇక విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపు సామాజిక వర్గం టీడీపీ వైపుగా పూర్తిగా మళ్ళేలా చూసే బాధ్యతను హై కమాండ్ గంటాకు అప్పగించింది.
ఓ వైపు వైసీపీ, మరో వైపు జనసేన ఈ మూడు జిల్లాలనే గురి పెట్టడంతో టీడీపీ అధినాయకత్వం సైతం గంటానే నమ్ముకుంటోంది. అటు అధినాయకత్వం, ఇటు పార్టీ నాయకులు ఇలా ఏకకాలంలొ గంటాపైనే పూర్తి విశ్వాసం ఉంచండంతో మంత్రి గారి అనుచరుల్లో ఆనందం అంబరాన్ని తాకుతోంది. రేపటి రోజున తమ నాయకుడు మరిన్ని విజయాలు సాధిస్తారని వారు అంటున్నారు