దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
Kalinga Times,Hyderabad : శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
రామ నామం విశిష్టత
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.
తారక మంత్రం
ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.
రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.