సూర్యడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం. ఇలా సూర్యడు ఏడాదిలో పన్నెండు రాశులలోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనూరాశి నుంచి మకరరాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటివరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు.
Kalinga Times,Hyderabad : సూర్యడి గమనం మారడం వల్ల ఇప్పటివరకూ ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది.
భోగి
భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేవేయటమే భోగి. ఇలా చేయటం వాళ్ళ దురదృష్టలు తొలగిపోతాయని నమ్మకం. సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన గొబ్బెమ్మలను పీడకలగా చేసి భోగి మంటలలో వేస్తారు. రంగు రంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం చేస్తారు. సాయంత్రం బొమ్మల కొలువులు పెడతారు. చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయటాన్ని భోగిపండ్లు పోయటం అని అంటారు. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగ, భాగ్యాలతో అప్పటికి ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు.
మకర సంక్రాంతి
క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకుంటారు.
కనుమ
ఇది సంక్రాంతి చివరి రోజు, నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వాళ్ళ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది.
కొత్త బియ్యంతో పిండివంటలు
సంక్రాంతినాడు కొత్త బియ్యంతో పిండివంటలని చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ కనిపిస్తాయి. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలే కాదు, రైతుల మనసులూ నిండుగా ఉంటాయి. అయితే ఇలా కొత్తగా చేతికి వచ్చిన బియ్యంతో ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే కొత్త బియ్యం అజీర్ణం చేస్తుంది. అందుకని వాటిని బెల్లంతో జోడించి పరమాన్నంగానో, అరిసెలుగానో చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల అటు పిండివంటా చేసుకున్నట్లవుతుంది, ఇటు జీర్ణసమస్యలూ తలెత్తవు. పంట చేతికి అందినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలిపినట్లవుతుంది.
తర్పణాలు
సంక్రాంతినాడు పెద్దలకు తర్పణం విడువటం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ ఇలా తర్పణాలను విడుస్తారు. తమకు చక్కటి జీవితాన్ని అందించి, మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలకు ఇలా కృతజ్ఞతలను చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది.