Telangana
నిబంధనలను ఉల్లంఘిస్తూ హాస్టళ్లలో అక్రమంగా, అనధికారికంగా బస
Kalinga Times,Hyderabad : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్స్‌లో అనధికారికంగా ఉంటున్న వారందరినీ వెంటనే ఖాళీ చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆదేశించింది. తమ ఆదేశాన్ని విద్యార్థులు కనుక పెడచెవిన పెడితే విశ్వవిద్యాలయం పోలీసులను, చట్టపరమైన చర్యలను ప్రారంభించవలసి వస్తుందని హెచ్చరించింది. కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయం అన్ని హాస్టళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. అంతేకాక, ప్రభుత్వ సూచనల ప్రకారం నీళ్లు, విద్యుత్ సరఫరా కూడా ఆపేసింది. అయితే, ఇటీవల విశ్వవిద్యాలయం హాస్టళ్లలో విద్యార్థుల ముసుగులో ఉన్న కొద్దిమంది వ్యక్తులు అనధికారికంగా ఉంటున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. నీరు, విద్యుత్ సరఫరా లేకపోయినప్పటికీ వారు ఉంటున్నట్లుగా గుర్తించారు. దీంతో విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతల సమస్య ఉందని గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ హాస్టళ్లలో అక్రమంగా, అనధికారికంగా బస చేయడాన్ని విశ్వవిద్యాలయం తీవ్రంగా పరిగణించిందని విశ్వవిద్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.