social
ఓసిపి-5 నిలిపివేయాలని ఓసిపి వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకుల నిరసన
Kalinga Times,Godavarikhani : వంద అండర్ గ్రౌండ్ మైనింగ్ లు ప్రారంభించి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కొరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలోని గొప్ప సీఎం కెసీఆర్ అని ఓసిపి-5 వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకులు ఎద్దేవా చేశారు సోమవారం అయిదోవ గని సమీపంలో ఓసిపి-5 వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకులు నిరసన చేపట్టారు .
అనంతరం ఓసిపి-5 వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకులు స్థానిక కార్పొరేటర్ పెద్దేళ్లి తేజస్విని ప్రకాష్, మద్దెల దినేష్ మాజీ కార్పొరేటర్ ఎం.డి బాబుమియా లు మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకొని అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని అన్నారు. ఒకవైపు గోదావరి నదిలో నీరు కలుషితం, మరోవైపు వివిధ పరిశ్రమలతో కాలుష్యం, ఇంకోవైపు ఓసిపి ల విషవాయువుల తో అనేక రకాలుగా ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని పాలకులు ఉండడం దుర్మార్గమని అన్నారు.
భవిష్యత్ లో బొందల గడ్డగా 5 ఇంక్ లైన్
ఐదవ గని మూసివేసి ఓ సి పి ఫైవ్ పేరుతో పారిశ్రామిక ప్రాంతాన్ని బొందల గడ్డ గా మార్చే ప్రయత్నం సింగరేణి యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.ఓ సి పి ల విషవాయువుల తో గాలి, దుమ్ము , ధూళి, పేలుళ్ల శబ్దాలతో, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, మరియు ఇండ్లు మొత్తం నేల మట్టం అయ్యే ప్రమాదముందన్నారు.
పట్టించుకోని శాసన సభ్యులు
నాకు ఓట్లేసి గెలిపిస్తే ఓసిపి 5 ఒంటిచేత్తో ఆపేస్తా అని ప్రగల్బాలు పలికిన ఎమ్మెల్యే ఈనాడు ఓ సి పి ఫైవ్ ఊసే ఎత్తకపోవటం శోచనీయమన్నారు.సోషల్ మీడియాలో కార్మిక పక్షపాతినని పొస్ట్ లతో ఊదరగొట్టే మన శాసన సభ్యులకు దశాబ్దాల చరిత్ర కలిగిన 5 ఇంక్ లైన్ ఏరియా కనుమరుగవడానికి యాజమాన్యం ప్లాన్ సిద్ధం చేస్తుంటే మౌనంగా ఉండటం వెనక మతలబు ఏమిటో కార్మికులు గమనించాలన్నారు.
అనుమతులపై నోరుమెదపని సింగరేణి యాజమాన్యం
ఓ సి పి కి అనుమతులు రాకున్నా కానీ సింగరేణి యాజమాన్యం ఒంటెద్దు పోకడలతో స్థానిక అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల అండ దండలతో ఇష్టానుసారంగా పనులు వేగవంతం చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు కార్మికుల సంక్షేమం విస్మరించి అధికార పార్టీ నేతలతో చెట్ట పట్టల్లు వేసుకుంటూ వారి కనుసన్నల్లో నడుస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూన్నారని ఆరోపించారు. సింగరేణి అదికారులు సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకాన్ని విస్మరించడం సిగ్గుచేటు అని వారు పేర్కొన్నారు. దాదాపు పది డివిజన్ ల ప్రజలకు ఈ ఒసిపి ప్రాజెక్టుతో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకమే ఈ ఓసిపి అని ఈ ప్రాంత వాసులకు పొమ్మనలేక పొగ పెడుతునారని దుయ్యబట్టారు..
ఆందోళనలకు సిద్ధమవుతున్న ఓసిపి వ్యతిరేక ఉద్యమ కమిటీ
ఓ సి పి 5 కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని మరియు రాష్ట్ర కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టు లు కూడా వెళ్తామని ఓసిపి వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొన్నం స్వరూప, జనగామ మల్లేష్, రమేష్, శ్రీనివాస్, సంపత్, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.