social
బతుకమ్మ పండుగ సంబరం తెలంగాణకే ప్రత్యేకమైనది
ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక్తమవుతుంది.
Kalinga Times,Hyderabad : తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే.. ఈ సంబరం తెలంగాణకే ప్రత్యేకమైనా గత చరిత్ర, జీవితగాథలు, సున్నితమైన మానవ సంబంధాలను తెలియజేస్తుంది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…’ అంటూ కష్టసుఖాలనూ, ప్రేమా ఆప్యాయతల్నీ బతుకమ్మ పాటలుగా మేళవించడం అందులో భాగమే. అందుకే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతి ఆరాధ్య పండుగ.శరదృతువులో వచ్చే బతుకమ్మ సంబరాలకు శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతుంటారు.