Telangana
ఓవైపు కరోనా బాధితుల తాకిడి.. మరోవైపు మురుగునీరు
Kalinga Times, Hyderabad : రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వరద నీరు వచ్చి చేరింది. ఓవైపు కరోనా బాధితుల తాకిడి.. మరోవైపు మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. జలమయమైన వార్డులతో వైద్యులు, సిబ్బంది, రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బుధవారం భారీ వర్షానికి పలు వార్డుల్లోకి మురుగు నీరు చేరింది. ఎగువ నుంచి పోటెత్తిన వర్షపు నీరు డ్రైనేజీ నీటితో కలిసి మోకాల్లోతు వరకు వార్డుల్లోకి చేరింది. రోగులు, వారి సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత భవనంలోని సూపరింటెండెంట్ కార్యాలయం, సెంట్రల్ స్టెరిలైజేషన్ విభాగం, పురుషుల వార్డుల్లోకి నీరు చేరింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం తెచ్చిపెట్టిన పీపీఈ కిట్లు ఈ వరదనీటిలో కొట్టుకుపోయాయి. కొందరు ఆ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్ అయ్యాయి.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ట్వీట్
ఒక వైపు కరోనా మహమ్మారి హైదరాబాద్‌ను చుట్టేస్తుంటే.. మరో వైపున నగరం నడిబొడ్డున ఉన్న ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వరద నీరు వచ్చి చేరింది. ఇవి సీఎం కేసీఆర్ పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వరద నీరు చేరిన ఫొటోను పోస్ట్ చేశారు.