social
కనిపించే దైవం అమ్మ
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కనిపించే దైవం అమ్మ. అమ్మపిలుపులోనే తీయదనం ఉంది.
రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా… బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’యే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
మరోవైపు, ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా
‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.