Telangana
12 నుంచి ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ
Kalinga Times, Hyderabad : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైతుందన్నారు. గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచామని, పేపర్ వాల్యుయేషన్‌కు వచ్చే లెక్చరర్స్‌కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు. కాగా కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు నిలిపివేశామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో మళ్లీ పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సబితా ధైర్యం చెప్పారు. హైకోర్టు అనుమతి రాగానే వారికి అన్ని వసతులు కల్పించి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నామని సబితా పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దన్నారు. నెలవారిగా మాత్రమే ఫీజులు వసూలు చేయాలని సూచించారు.