Telangana
లాక్‌డౌన్ విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో…
Kalinga Times,Hyderabad : లాక్‌డౌన్ విషయంలో కేంద్రం ఎలా ఉన్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చాలా పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ విధిస్తే.. కేసీఆర్ దాన్ని మే 7 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్లలో సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం సూచించినా కేసీఆర్ మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడానికే మొగ్గు చూపారు.గతంలో లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని కుండబద్దలు కొట్టిన కేసీఆర్.. మే 7 తర్వాత కూడా అదే రీతిలో వ్యవహరించకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే తెలంగాణాలో కరోనా కేసుల పెరుగుతున్నప్పటికీ.. వ్యాప్తి అదుపులోనే ఉంది. అంతేకాదు రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1000 దాటగా.. రికవరీ అయిన పేషెంట్ల సంఖ్య 307 దాటింది. అంటే రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో 31 శాతం మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. మరి కొద్దిరోజుల్లోనే ఇంకొంత మంది కూడా కరోనా బారి నుంచి కోలుకొని రికవరీ అయ్యే అవకాశం ఉంది.
అంతే కాదు తెలంగాణలోని కరోనా కేసుల్లో 113 కుటుంబాల్లో నమోదైన కేసులే 43 శాతం ఉన్నాయని సమాచారం.గత ఐదు రోజుల డేటా చూస్తే.. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది. పొరుగున ఉన్న ఏపీ కంటే రికవరీ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. తెలంగాణలో మెజార్టీ కేసులు జీహెచ్ఎంసీ, వికారాబాద్, సూర్యాపేట, గద్వాల ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయి.
కరోనా పాజిటివ్ పేషెంట్లు కోలుకోవడం, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమనేది తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త వహిస్తే చాలు తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తుంది. రెడ్‌జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ..గ్రీన్‌జోన్లలో లాక్‌డౌన్‌ను సడలించే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది. మరో వారంపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కరోనా అదుపులోకి వస్తుందని భావిస్తే.. ఇంకో మే నెల మధ్య వరకు లాక్‌డౌన్ ఉండొచ్చు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మే 5న తేలనుంది.