Telangana
ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ ఔషధ సంస్థలవే…
కరోనా టీకాల తయారీకి ప్రయత్నిస్తున్న ఆరు ఔషధ సంస్థల్లో మూడు తెలంగాణవే
Kalinga Times, Hyderabad : కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం చైనాతో పాటు అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్, క్యూబా తదితర దేశాల్లో శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేస్తున్నారు. వ్యాక్సిన్ కనుక్కునే రేసులో భారత్ కూడా ముందు వరసలోనే ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు.దేశంలోని ఆరు ఔషధ సంస్థలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయని తెలిపారు. వీటిలో మూడు సంస్థలు తెలంగాణవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా నియంత్రణకు ఔషధాలు, పీపీఈ కిట్ల తయారీ, తక్కువ ధరలకే వెంటిలేటర్లు తదితర అంశాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లోని వివిధ ఔషధ సంస్థలను ప్రోత్సహిస్తోంది. అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికరంగా బదులిచ్చారు. భారత్ నుంచి కరోనా టీకాల (వ్యాక్సిన్) తయారీకి ప్రయత్నిస్తున్న ఆరు ఔషధ సంస్థల్లో మూడు తెలంగాణవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని ఔషధ సంస్థలే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.