National
దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు.
Kalinga Times, Hyderabad : ప్రధాని మోదీ పిలుపు అందుకొని దేశంలోని గ్రామాలు, పట్టణాలన్నీ దీప కాంతులతో వెలిగిపోయాయి. ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి సరిగ్గా 9 గంటలకు దీపాలు వెలిగించారు. 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు. అంతకుముందే ఇళ్లలోని లైట్లన్నీ ఆర్పేశారు. గుమ్మాల ముందుకు, బాల్కనీలలోకి వచ్చిన జనం.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు.
కొంత మంది సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లతో సంఘీభావం ప్రకటించారు. కొంత మంది కాగడాలు వెలిగించారు. భారత్ మాతా కీ జై నినాదాలతో పలు ప్రాంతాలు మార్మోగిపోయాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దీప కాంతులతో భారత్ దేదీప్యమానంగా వెలిగిపోయింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ సంప్రదాయ దుస్తులు ధరించి దీపాలు వెలిగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో దీపాలు వెలిగించారు.
సమీక్షా సమావేశంలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో కలిసి ప్రగతి ప్రాంగణంలో కొవ్వొత్తులు వెలిగించారు.అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అధికారులతో కలిసి కొవ్వొత్తులు ప్రదర్శించారు.