Religious
ఆలయాల్లోనూ ఏకంతంగా శ్రీరామ నవమి వేడుకలు
Kalinga Times, Hyderabad : రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలలో దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగనవాడు..వీరుడు, సాహసికుడు.. వేద వేదాంతాలను తెలిసివాడు. చేసిన మేలును మరవనివాడు. సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞాన వంతుడు. సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.. శకల శాస్త్రాల్లోనూ పండితుడు. సమస్త కార్యాలలోను సమర్ధుడు.. సులక్షణమైన రూపసి (అందగాడు), అత్యంత ధైరశాలి, క్రోధాన్ని జయించివాడు, సమస్తలోకల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేని వాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు.
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల అంగరంగా వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు, శ్రీసీతారామ కళ్యాణం జరుపుతారు. కరోనా మహమ్మారి దేశంలో జడలు విప్పుకోవడంతో ఈసారి సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించే అవకాశం భక్తులకు లేదు.
అన్ని ఆలయాల్లోనూ ఏకంతంగా కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.