Telangana
బుక్ చేసిన 14 రోజుల తర్వాత మాత్రమే మరో దానికి …
Kalinga Times, Hyderabad : హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పెరిగింది. మామూలుగా అయితే రోజుకు లక్ష నుంచి రెండులక్షల వరకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేస్తుంటారు నగరవాసులు.కానీ ఇప్పుడు గ్యాస్ బుకింగ్స్ మూడున్నర లక్షలుగా ఉంది. దీంతో పలు గ్యాస్ కంపెనీలు
గ్యాస్ సిలిండర్ నమోదు ప్రక్రియలో మార్పులు చేశాయి. వంట గ్యాస్ సిలిండర్లకు అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో బుకింగ్స్ పై ఆంక్షలు విధించాయి.సిలిండర్ బుక్ చేసిన 14రోజుల తర్వాత మాత్రమే మరో దానికి బుక్ చేసుకునేలా గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. భారత్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు శుక్రవారం నుంచే ఈ నిబంధనల్ని అమలు చేశాయి. ఇండేన్ గ్యాస్ కంపెనీ శనివారం నుంచి ఈ రూల్స్ పాటించనుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం సిలిండర్ వచ్చిన 24 గంటల తర్వాత మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతోనే గ్యాస్ సిలిండర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.మరోవైపు ఇప్పటికే కేంద్రం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారికి ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. దీంతో వాళ్లు కూడా గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఉజ్వల స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచిత గ్యాస్ అందిస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. అంతేకాకుండా పేద సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, వితంతువులకు నగదు బదిలీ ప్రయోజనాన్ని అందిస్తామని తెలిపారు. వీరికి రూ.1,000 అందజేస్తామని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల కాలంలో రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఈ డబ్బులు అందజేస్తామని తెలిపారు.