Kalinga Times, Hyderabad : వ్యక్తిగత బాధ్యతతో కరోనా కట్టడీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, విదేశాల నుంచి వచ్చినవారికి చేతులెత్తి దండం పెడుతున్నానని అన్నారు.
‘‘మీరు మా రాష్ట్రం బిడ్డలే.
బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలి? ప్రజలు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ రవాణా సంస్థల్ని నిలిపివేస్తున్నాం. సోమవారం ఉదయం వరకు ప్రజలు ఎవరూ బయటికి రావద్దు’’ అని కేసీఆర్ అన్నారు. 700 మందికి పైగా కరోనా అనుమానితులకు పరీక్షలు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య వస్తోందని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారని తెలిపారు. కరీంనగర్ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదన్నారు. 11 వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని, 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై 14 రోజుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.