
Kalinga Times, News Delhi : మనం 14 గంటలపాటు ఇంట్లోనే ఉన్నంత మాత్రాన వైరస్ ఉన్న ప్రాంతాలు వైరస్‌లేని ప్రాంతాలుగా మారిపోవని వైద్య అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులకు వారి శరీరతత్వాన్ని బట్టి 4 నుంచి 14 రోజుల దాకా ఎలాంటి లక్షణాలూ కనపడవన్నారు. ఆ సమయంలో వారు క్యారియర్లుగా ఉంటారు. అంటే.. వారి నుంచి వైరస్ మరొకరికి పాకుతుంది. కరోనా వైరస్ ఏ ఉపరితలంపై ఎంత సేపు మనుగడ కొనసాగిస్తుందన్న విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ప్రిన్సటన్ వర్శిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షెన్ డిసీజెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (హామిల్టన్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తదితర సంస్థల శాస్త్రజ్ఞుల అధ్యయనం చేశారు. కరోనా వైరస్ రాగి ఉపరితలంపై 4 గంటలు, ప్యాకేజింగ్‌కు వాడే అట్టపెట్టెలపై 24 గంటలు ఉంటుంది. ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై 2 నుంచి 3 రోజులపాటు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల దాకా బతకగలదు.కాబట్టి ఆ 14 గంటలే కాక, వైరస్ ముప్పు తగ్గేవరకూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించడం మంచిదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందుకే 14 గంటలు ఇంట్లో ఉంటే వైరస్ తగ్గిపోతుందని అపోహలు వద్దు. కరోనా వైరస్ తగ్గేవరకు ప్రతీ రోజు సామాజిక బాధ్యతతో ఉందాం.