National
కొరోనా వైరస్ – ప్రపంచ మహమ్మారి
భారతీయులు "ఎంత గొప్పవాళ్లో" కొరోనా వైరస్ కి తెలియదు సీరియస్ గా తీసుకోవాలి
ఆమెరికా ఆసుపత్రిలో పనిచేస్తున్న మన తెలుగు వైద్యురాలు, డాll చెక్కిళ్ళ చైతన్య గారు పంపిన సత్యాలు, నిజాలు
Kalinga Times,Hyderabad : కొరోనా వైరస్ పేరు Severe Acute Respiratory Syndrome- Corona Virus- 2 (SARS-CoV-2). దీనితో వచ్చే వ్యాధిని COrona VIrus Disease- 19 (COVID-19) అంటారు.
ఈ COVID-19 కి ప్రస్తుతానికి వ్యాక్సీన్ కనిపెట్ట బడలేదు. బహుశా, దాన్ని కనిపెట్టి, వాడుకలోకి తీసుకు రావడానికి కనీసం ఒక సంవత్సరం పట్టొచ్చు అని అంచనా. దేవుని దయ ఉంటే, ఈలోగానే రావచ్చు.
ఈ COVID-19 కి ఇంతవరకూ సరియైన, ఖచ్చితమైన వైద్యం గానీ, మందులు గానీ లేవు. ప్రతీ దేశంలోనూ రకరకాల HIV మందులు, ఇతర యాంటీ వైరల్స్ లాంటివి ప్రయత్నించటం మాత్రం జరుగుతోంది… అంతే. ఇది నిజం.
కొత్తగా ఉద్భవించిన వైరస్ కావడంతో, ప్రపంచంలో ఎవరూ ఈ వ్యాధికి సంబంధించి నిరోధక శక్తిని కలిగి లేరు. Epidemiologists (నిపుణులు) అంచనాల ప్రకారం దీనిని వెంటనే అదుపు చేయకపోతే, ప్రపంచంలో సగం మంది దీని బారిన పడే ప్రమాదం ఉంది. అలా జరిగితే, ఒక్క అమెరికాలోనే పది లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా.
ఈ COVID-19 వల్ల వచ్చే ముఖ్య లక్షణాలు పొడి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
ఈ COVID-19 రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి నుండి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుంది కనుక వ్యాధి వచ్చినవాళ్లు అది ఇతరులకు సోకకుండా మాస్క్ వేస్కోవాలి.
ఈ వైరస్ భూమి మీది ఉపరి తలాలపై 3 గంటల నుండి 3 రోజుల వరకూ బతికి ఉండే అవకాశం ఉంది. అందుకే, చేతులు కడుక్కోవడం, ముఖాన్ని చేతులతో ముట్టుకోకుండా ఉండడం చాలా చాలా అవసరం. అలాగే, షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా మానుకోవాలి.
ఈ COVID-19 వైరస్ సోకాక, వ్యాధి లక్షణాలు ఎక్కువ శాతం మందికి 5 రోజుల్లోగానే మొదలవుతాయి. నిజానికి, 2 నుండి 14 రోజుల్లో ఎప్పుడయినా ఈ లక్షణాలు మొదలవచ్చు. అందుకే ఈ COVID-19 వ్యాధి వచ్చినవాళ్లతో కలిసి ఉండటం సంభవిస్తే, లేదా అనుమానం వస్తే, 14 రోజుల పాటూ అందరికీ దూరంగా లేదా క్వారంటైన్ లో ఉండాలి. పొరపాటున కలిసి ఉన్నట్లైతే, అతి తేలికగా ఇతరులకు ఈ వైరస్ అంటుకుంటుంది.
మామూలుగా వచ్చే (influenza) ఫ్లూ జ్వరం కన్నా ఈ COVID-19 వైరస్ కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది.
ఈ COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాల(దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10% నుండి 20% మందికి ఆసుపత్రిలో చేరే అవసరం ఏర్పడుతుంది. కనీసం 2% నుండి 3% మంది ఈ వ్యాధితో చనిపోయే అవకాశం ఉంది. వారిలో చాలామటుకు వృద్ధులు, ఇంకా గుండెజబ్బులు, డయబీటీస్ (షుగర్) వంటి వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువగా ఉంటారు.
నిజానికి, ఇది ఇప్పటివరకూ మనం కనీ, వినీ, ఎరుగని పరిస్థితి. శతాబ్దాల తరబడి మానవ జాతి గుర్తుంచుకోవలసిన విషయం. 400 ఏళ్ల క్రితం వచ్చిన ప్లేగు మహమ్మారిని గుర్తుంచుకునే విషయంలో భాగంగానే, అది తగ్గాక, ఆ విజయానికి గుర్తుగా భాగ్యనగరంలో ఛార్మీనార్ నిర్మించారు. ఈసారి అటువంటి ఉత్పాతం ఏదీ జరుగకుండానే ఉండాలని అందరం ఆ దైవాన్ని ప్రార్థిద్దాం.
నేనొక వైద్యురాలిగా మాధ్యమాల్లో పోస్టులు పెట్టేది చాలా అరుదు. ఐతే, ఈ కొరోనా వైరస్ గురించి చాలా మంది వద్ద పేరుకున్న అజ్ఞానాన్ని చూస్తూ, వారిని దాని నుండి విముక్తుల్ని చేసేందుకు వ్రాస్తున్నాను. అలా చెప్పడం నా బాధ్యత కూడా !
నేను అమెరికాలో కుటుంబ వైద్యురాలిగా పని చేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంతాధునిక వైద్య సదుపాయాలున్నాయని సగర్వంగా చెప్పుకునే అమెరికాలోని పరిస్థితికి ప్రత్యక్ష సాక్షిని నేను.
రెండు వారాల క్రితం వాషింగ్టన్ లో మొదలై, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు పాకిన కొరోనా వైరస్ అమెరికాని ప్రస్తుతం అతలాకుతలం చేస్తోంది. రెండు వారాలుగా మన ప్లాన్ ఏమిటి అని తర్జన బర్జనలు పడుతున్న మా క్లినిక్ లో మార్చ్ 12వ తేదీన మిగిలిన అన్ని ఆసుపత్రులలో లాగానే పెనుమార్పులు జరిగాయి.
ముందునుండీ జాగ్రత్తగా గమనించే వాళ్లకి పరిస్థితి అర్థమైనా, మొదటిసారి రాష్ట్ర ఆరోగ్య, వైద్య విభాగం నుండి వచ్చిన నోటీస్ లోని సమాచారం అందరినీ ఒక్క కుదుపు కుదిపేసింది. “తీవ్రమైన వ్యాధితో ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉన్నవాళ్లకు తప్ప, కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి వలయు టెస్ట్ కిట్స్ లేవు”, అనేది దాని సారాంశం.
అంటే, కరోనా వైరస్ వచ్చిన వారిలో తేలికపాటి వ్యాధి లక్షణాలు మాత్రమే కలిగి ఉండే 80% మందిని టెస్ట్ చేయడానికి ఇప్పడు ఏ మాత్రం అవకాశం లేదు. అంటే Covid-19 వైరస్ సోకిన వాళ్లందరినీ గుర్తించి, వేరు చేసే అవకాశం లేదు. అందువల్ల, వాళ్లు యధావిధిగా ఆ వైరస్ ని వ్యాపిస్తూ పోతారు. ఇది అత్యంత ప్రమాదకర విషయం.
అంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ లో చెప్పే వ్యాధిగ్రస్థుల నంబర్లన్నీ ఏ మాత్రం అర్థం లేనివి. పరీక్షలు లేకపోతే, పాజిటివ్ లు లేవు కదా! ఐతే, కొద్ది రోజుల్లో ఎంత మందినైనా పరీక్షించ గలిగే పరిస్ధితులు వస్తాయి. కానీ, జరగాల్సిన నష్టం ఇప్పటికే చాలా జరిగిపోయింది. ఇంకా అప్పటివరకూ, ఎంత నష్టం వాటిల్లుతుందో అంచనా వేయలేని దుస్థితి.
పేషెంట్లను గుర్తించి, వారిని క్వారంటైన్ లో పెట్టలేని ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే. వైరస్ వ్యాప్తిని వీలైనంత తగ్గించడం. దానిని విజయవంతం చేయాలంటే, ఈ క్రింది జాగ్రత్తలతో మాత్రమే సాధ్యం.
ఈ వైరస్ సోకకుండా, తద్వారా ప్రాణనష్టం తగ్గించడానికి చేయవలసింది ఖచ్చితంగా ఇతరులకు దూరంగా ఉండటం. అంటే, 144 సెక్షన్ పెట్టినప్పుడు ఎలాగైతే మనుషులను గుంపులుగా తిరగనివ్వరో, అలా జీవించటం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్, ఎలక్షన్స్ వంటివి ఆపేయడం. మనుషులు సమూహాల్లోనూ, గుంపులుగానూ కలవకుండా నివారించడం.
ఇందులో ప్రభుత్వాలు ఏమి చేయాలి ? వైద్య వ్యవస్థ ఏమి చేయాలి ? ప్రజలు ఏమి చేయాలి ? అనేది పెద్ద ప్రశ్న. ఐతే, అన్ని విభాగాల వాళ్లు కూడా తాము చేయాల్సింది చేయకపోతే, ఈ వైరస్ వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని అరికట్టే అవకాశం ఎంత మాత్రం లేదు.
వైరస్ సోకిన వారందరినీ టెస్ట్ చేయలేమన్న ఒకే ఒక్క కొత్త స్పృహతో మా ఆసుపత్రిలోని వైద్యులు, మేనేజర్లు, తదితరులందరూ ఎంతో అప్రమత్తమయ్యారు. మా క్లినిక్ లో ఇప్పుడు ప్రత్యక్షంగా పేషెంట్లను చూడడం ఆపేశాం. అత్యవసర వైద్య సదుపాయాలు అవసరమైన వారిని “ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్” కి పంపుతున్నాం. మిగిలిన వాళ్లతో ఫోన్ విజిట్స్ చేస్తున్నాం. మామూలు వైద్యాన్ని రెండు నెలల పాటూ పోస్ట్ పోన్ చేశాం.
ఇప్పుడున్న అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, వచ్చే రెండు వారాల్లో కొరోనా వైరస్ రోగులను చేర్చుకోలేక, అమెరికాలోని వైద్య వ్యవస్థ కుప్పకూలడం. ఎందుకంటే, ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, కొరోనా వైరస్ రోగులు ప్రతి ఆరు రోజులకు రెట్టింపు అవుతున్నారు.
నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే రెండు వారాల్లోనే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ఈ దేశంలో లక్షల్లోకి చేరుతుంది. అందులో, ప్రతి వంద మందికి 10 నుండి 20 మందికి ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం ఏర్పడుతుంది. తక్కువలో తక్కువ, అందులో ఇద్దరు చనిపోతారు. అంటే కోటి మందికి వైరస్ వస్తే, పది లక్షల మందిని ఆసుపత్రిలో చేరిస్తే, రెండు లక్షల మంది చనిపోతారు.
అమెరికాలో సుమారు 45,000 ICU beds, 1,60,000 ventilators మాత్రమే ఉన్నాయి. రెండు మూడు వారాల్లోనే ఇక్కడి వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా! ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్నట్లు, ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిపోక, ఎవరికి ఆక్సిజెన్ ఇవ్వాలి ? ఎవరిని వెంటిలేటర్ మీద పెట్టాలి ? అని వైద్యులు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే, బతికించే అవకాశం ఉన్నా గానీ, సదుపాయాలు లేక బతికించలేని దుస్థితి.
ఇటలీలో లాగానే ఇక్కడ కూడా చనిపోయిన వారికి funaral homes నిరాకరిస్తే, బంధువులు మురిగే శవాలతో ఇళ్లలో ఉండాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని ఆసుపత్రుల్లో చాలామటుకు ఒక వారం రోజుల కన్నా ఎక్కువ వచ్చే మాస్కులు, గౌన్లు లేవని అంచనా ! ఆ తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయాందోళనలు కలిగించే దుస్థితి.
అమెరికాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఎక్కువ శాతం ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేని భారతదేశంలో ఏమి జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నా మనవి.
ఇండియాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అత్యవసరమైనతే తప్ప ఇంటి బయటకు వెళ్లొద్దని, ఎవరినీ కలవొద్దని చెప్పాను. ఈ వైరస్ వయసులో చిన్నవారికి సోకితే వారు కొంత జ్వరం, దగ్గులతో బాధ పడి, కోలుకునే అవకాశాలు ఎక్కువ. కాని వయసు పైబడ్డ వారికి సోకితే, వాళ్లు ఆసుపత్రిలో చేరే అవకాశం, చనిపోయే అవకాశం ఎక్కువ.
Social distancing పాటించి high risk population అయిన older population ని, ఇతర వ్యాధులతో బాధపడుతూ immunity తక్కువ ఉన్న వాళ్లని కాపాడుకుందాం.
కొరోనా వైరస్ ఇంఫెక్షన్ రాకున్నా, బయటకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి అనుకునేవాళ్లు ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. Social distancing పాటించకపోతే ఈ వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగి, ఉన్న ఆస్పత్రులు సరిపోక, కొత్త ఆసుపత్రులు కట్టే సమయం లేని దుస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో వైద్యులు, ICU beds, ventilators సరిపోక, ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది.
Social distancing పాటించడం వల్ల ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. తద్వారా వీలయినంత మందికి వైద్యం అందించే వీలు ఉంటుంది. వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గకపోయినా దేశం లోని వైద్య వ్యవస్థ ఒకేసారి overload కాకుండా ఉంటుంది.
పైన చెప్పిన అంచనాలన్నింటినీ కొంతవరకైనా మార్చే అవకాశం మనందరి చేతుల్లో ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, ఇతరులను కలవకుండా ఉండి వీలయినంత మంది ప్రాణాలను రక్షించుకుందాం !
– చైతన్య చెక్కిళ్ల, MD, USA…