Kalinga Times ,Hyderabad : కేసీఆర్ డెడ్‌లైన్‌ను ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం పట్టించుకోలేదు. మంగళవారం అర్ధరాత్రితో ఆయన ఇచ్చిన న గడువు ముగియగా, కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. వీరిలో బస్‌భవన్‌లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 62 మంది, హైదరాబాద్ జోన్‌లో 31, ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ వివరాలపై అటు ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ వర్గాలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలను బుధవారం నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరింది. సమ్మెపై ప్రభుత్వం గడువు విధించినా విధుల్లో చేరేది లేదంటూ కార్మికులు పలు జిల్లాల్లో ప్రతిజ్ఞలు చేశారు.
గడువు ముగుస్తున్నా..
కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. 48 వేల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత కేవలం 300 మందికి లోపే కార్మికులు విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌లోనే 120 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కూకట్‌పల్లి, కుషాయిగూడ, హయత్ నగర్, మెదక్, గద్వాల, మేడ్చల్, మిర్యాలగూడ, షాద్‌నగర్, నారాయణపేట్, ఖమ్మం తదితర డిపోల్లో పలువురు కార్మికులు విధుల్లో చేరారు.