Religious
వల్లభ గణపతి ఆలయంలో కార్తీక పూజ
Mahender ,Kalinga Times, Malkajigiri : హిందువులు అందరూ అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలోఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. కార్తీక మాసంలో శివుడి ఆరాధన చాలా ముఖ్యమైనది. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసమే అని పురాణాల్లో పేర్కొనబడింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ మరుసటి రోజున పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. భక్తులంతా భోళాశంకరుడిని స్మరిస్తూ ఉంటారు. దీంతో కార్మిక మాసం అంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది.
కార్తీకానికి సమానంగా ఏ మాసం లేదు..!
నెలరోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. పురాణాలలో తొలిసారిగా వశిష్ట మహర్షి జనక మహారాజులకు కార్తీక మాస వైభవాన్ని వివరించారు. జన్మ జన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన దీప దానం, సాలగ్రామ పూజ, పూజ, వన భోజన కార్యక్రమాలను ఎక్కువగా జరుపుతారు. కార్తీక మాసంలో భక్తులు అందరూ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ ఆదిదేవుని కరుణా కటాక్షాలు లభిస్తాయి.
ఈ కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల పరమేశ్వరుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు.