Religious
వెలుగు జిలుగుల దీపావళికి స్వాగతం..
Kalinga Times,Hyderabad ; దీపావళి రోజున ఉదయం చేసే అభ్యంగన స్నానాన్ని పవిత్ర గంగాస్నానంతో పోల్చుతారు. ఆరోజున ఇంటి బావి వద్ద లేదా నదుల వద్ద స్నానం చేయడం ద్వారా పవిత్ర గంగలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.
ఈ దీపావళి రోజున పూజ ఎపుడు ?
వికారినామ సంవత్సరం 27 అక్టోబర్ 2019, ఆదివారం పూట, చతుర్థి తిథి, చిత్త నక్షత్రంతో కూడిన శుభ దినానఉదయం 4.30 గంటల నుంచి 6.00 గంటల్లో తైల స్నానం, అభ్యంగన స్నానం చేసేందుకు సమయం ఉత్తమంగా వుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఉదయం 7.00 గంటలకు పైగా 8 గంటల్లోపు శుక్ర హోరలో దీపావళి పండుగకు సంబంధించిన పూజను చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
ఏ పూజలు ఫలితాన్నిస్తాయి?
అదే రోజున సర్వ అమావాస్య కేదార గౌరీ వ్రత పూజను సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు గురు హోరలో లక్ష్మీ కుబేర పూజను చేయడం ఉత్తమ ఫలితాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు. దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
దీప కాంతులతో..
దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.