social
తెలంగాణ విమోచన (స్వాతంత్ర) దినోత్సవం
Kalinga Times,Hyderabad : తెలంగాణ ఉద్యమ చరిత్ర సింపుల్‌గా చెప్పుకునేది కాదు. అది చాలా పెద్దది. ఎన్నో త్యాగాల ఫలం అది. అందుకే ప్రతిపక్షాలు ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపమని కోరుతున్నాయి. కానీ… టీఆర్ఎస్ ప్రభుత్వం… అందుకు ససేమిరా అంటోంది. మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్లే టీఆర్ఎస్ వెనకడుకు వేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ .
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు… అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత…
కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే… భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా… నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు. ఆ రోజు… 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచనదినోత్సవంగా జరుపుకుంటున్నారు.