Religious
మండపంలోని రాతి స్తంభంపై కేసీఆర్ చిత్రం.. కారు గుర్తు
Kalinga Times, Yadadri : లక్ష్మీ నరసింహుడు స్వయంభువుగా వెలిసిన యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండగా, ఇక్కడ ఏర్పాటు చేయనున్న రాతి శిలలపై సీఎం కెసిఆర్ చిత్ర పటాలను చెక్కారు. కెసిఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారు చిహ్నం, కెసిఆర్ కిట్, హరితహారం, రాష్ట్ర పక్షి నెమలి, జంతువు కృష్ణ జింక తదితరాలను కూడా పొందుపరిచారు. ఈ రాతి స్తంభాలను అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం చేయనున్నారు. మరో వెయ్యేళ్ల పాటు సిఎం కెసిఆర్ ప్రజలకు గుర్తుండేలా చూసేందుకే ‘సారుకారు… సర్కారు పథకాలు’ను స్తంభాలపై చెక్కినట్టు తెలుస్తోంది.
వీటితో పాటు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలియజేసేలా ఆనాటి చిహ్నాలు, బొమ్మలు, ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా బొమ్మలనూ స్తంభాలపై చెక్కారు. ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ శిలలపై ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలనూ చెక్కారు. ఇవన్నీ ఆలయంలో శాశ్వతంగా అమరిపోనున్నాయి. ప్రస్తుతం చలామణిలో లేని ఒక పైసా, రెండు పైసలు, అణా, అర్ధణా బొమ్మలు కూడా వీటిపై ఉన్నాయి.
ఇదిలా ఉంటే…
ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం..టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు చెక్కి దర్శనమిస్తాయి. వీటితో పాటుగా ప్ర భుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్ కిట్, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఇలా దేవాలయం మీద చెక్కటం వివాదాస్పదమైంది. పురాతన ఆలయాలపై అలనాటి చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను చెక్కటం సర్వ సాధారణం. కానీ, ఇక్కడ దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి..పార్టీ గుర్తు.. ప్రభుత్వ పధకాలను చెక్కటం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.