social
బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే మార్గదర్శి
Kalinga Times, Hyderabad : ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.
ఒక గురువు ఎలా ఉండాలి ?
గురువు శాంతంగా ఉండాలి. మంచి దుస్తులు ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, వివిధ అంశాల పై చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి వాడే.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.
ఉపాధ్యాయ దినోత్సవం ఎలా మొదలయింది ?
భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జీవించి ఉన్న సమయంలో, కొంతమంది విద్యార్ధులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామని అంటే, దానికి ఆయన నా పుట్టినరోజుకంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా చేస్తే సంతోషిస్తాను అని అన్నారట.. దాంతో ఈ గురు పూజ్యోత్సవం మొదలయింది. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది. ఎంఎన్ రాయ్ మాటల్లో చెబితే.. భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
రూపు దిద్దేది ఉపాధ్యాయులే……
తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే.
బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే మార్గదర్శి
బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే మార్గదర్శి ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది.ఎంత ధనవంతులైనా, గొప్పవారైనా, గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు..మన ఉన్నతికి పాటుపడి, మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.. మరొక్కసారి గురువులందరికీ గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియ జేద్దాం.