National

కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే

Kalinga Times,New Delhi : కాశ్మీర్ విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ నిమిషం నుంచి కాశ్మీర్ విషయంలో అనూహ్య మలుపులు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లాడు.. ఆ సందర్భంగా ట్రంప్ కాశ్మీర్ సమస్యకు తానే పరిష్కారం చూపుతానన్న రీతిలో మట్లాడాడు. పాకిస్థాన్ కూడా ట్రంప్ మాటలకు వంత పాడింది.. అయితే ట్రంప్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనతో అప్రమత్తమైన మోడీ సర్కారు వ్యూహాలకు పదును పెట్టింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్‌ను కాశ్మీర్‌కు పంపింది. రెండు రోజుల అనంతరం భారీగా భద్రతాబలగాలను కాశ్మీర్‌కు తరలించారు. నిత్యం రావణకాష్టంలా రగిలే కాశ్మీర్‌లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్లను హౌస్ అరెస్ట్ చేసి చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ, కశ్మీర్‌, లద్ధాఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లద్ధాఖ్‌‌కు ఎలాంటి అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, అయితే జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక ఢిల్లీలాగా ఉంటుందని, ముఖ్యమంత్రి ఉంటారని, గవర్నర్ ఉండరని, గవర్నర్ జనరల్ ఉంటారన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ విభజన పై అమిత్ షా సుదీర్గంగా మాట్లాడుతూ… ప్రపంచమంతా ఎక్కడో ఎదిగిపోతోంది. కశ్మీర్‌ మాత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ పాలసీ దగ్గరే ఆగిపోయింది. ఓ వర్గం చురుగ్గా పనిచేసి కశ్మీర్‌ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కశ్మీర్‌ను పాలించే కుటుంబాలు మాత్రం లండన్‌లో సౌకర్యంగా బతుకుతాయి.
కశ్మీరీలు మాత్రం 18వ శతాబ్దంలో మగ్గిపోతారు. ఇదేనా మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్యం. కశ్మీరీ యువతకు మేం ధైర్యం చెప్పాలనుకుంటున్నాం. వారికి ఉద్యోగం కల్పించి, కొత్త భవిష్యత్‌ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే 370 ఆర్టికల్‌ను రద్దు చేశాం. కశ్మీర్‌ వ్యవహారాన్ని నెహ్రూ జఠిలం చేశారు. జునాగఢ్‌, హైదరాబాద్‌ను పటేల్‌ సమర్థంగా విలీనం చేశారు. ఆర్టికల్‌ 370తో పటేల్‌కు సంబంధం లేదు. కేవలం 370 వల్లే కశ్మీర్‌లో సాంస్కృతిక పరిరక్షణ జరగలేదు. 370 ఆర్టికల్‌తో ఆ మూడు కుటుంబాల పరిరక్షణే జరిగింది.’’ అని అమిత్ షా అన్నారు. కాగా ,జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 125 మంది, వ్యతిరేకంగా 61 మంది ఓటేశారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. ఓటింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close