Kalinga Times,Hyderabad : ఆగస్టులో శ్రీవారి వారికి రెండు సార్లు గరుడ సేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 5న గరుడ పంచమి, 15న శ్రావణ పూర్ణిమ పర్వదినాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఏటా తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు.
గరుత్మంతుడు,సర్పజాతి…
కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ‘నాగ పంచమి’గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని ‘గరుడ పంచమి’ అని కూడా పిలుస్తుంటారు.
సర్పభయం లేకుండా ఉండటం కోసం...
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా ఉండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే శ్రావణ శుద్ధ పంచమి రోజున గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే సోదరులున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 15న గురువారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.