Religious
దర్శన భాగ్యంతోనే కష్టాలను తొలగించే వేదాద్రి నరసింహుడు

Kalinga Times,Vijayawada : నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో వేదాద్రి ఒకటి. వేదాద్రి క్షేత్ర మహత్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి కాశీ ఖండంలో కనిపిస్తుంది. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి వేదాద్రి అనే పేరు వచ్చింది. కృష్ణాజిల్లాలో కృష్ణానది తీరంలో కొలువుదీరి భక్తులకు పుణ్య ఫలాలను అందిస్తోంది.
స్థలపురాణం ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుండి వేదాలను అపహరించి వాటిని సముద్రగర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యవతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు తన సన్నిథిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని వధించిన అనంతరం ఆ కోరిక నెరవేరుతుందని స్వామి చెప్పాడు.
తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతోందని, అందువల్ల తాను వచ్చేంత వరకూ ఈ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు. సాలగ్రామ నరసింహ స్వామి, జ్వాలా నరసింహ స్వామి, వీర నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి అనే అయిదు అంశలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు.
యోగానంద నృసింహస్వామివారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడింది. ఇక్కడకి వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామికి ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
విశ్వేశ్వరుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. పవిత్ర కృష్ణానదీ తీరాన గల కొండ పైన శ్రీ జ్వాలా నరసింహ స్వామి స్వయంభూ మూర్తిగా వెలసి ఉన్నాడు. కొండ క్రింద శ్రీ యోగానంద నరసింహాలయం ఉంటుంది. ఆలయంనకు ఎదురుగా గల కృష్ణానదిలో నరసింహ సాలగ్రామ్ ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు, మానసిక వ్యాధులకు, కుటుంబపరమైన ఇబ్బందులకు సత్వర పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.