Religious
త్రిమూర్తుల అంశలతో దత్తాత్రేయ స్వామి
Kalinga Times,Hyderabad : ఒక మానవకాంత పాతివ్రత్యాన్ని పరీక్షించదలచారు త్రిమూర్తులు. వెక్కిరించబోయి వెనుకకు పడినట్లు అయింది ఆ త్రిమూర్తుల పని. ఆ పతివ్రత అనసూయ మాత చేతిలో పసికందులైపోయారు ఆ ముగ్గురు. ముద్దులొలికే ఆ పసికందులకు పాలిచ్చి పరవశించింది అనసూయమాత.జొకొట్టి నిద్రపుచ్చింది కూడా ఆమె. అది తల్లిప్రేమ. ఇక ముగ్గురమ్మలు లక్ష్మి, పార్వతి, సరస్వతులు అనసూయమాత వద్దకు వచ్చి తమ భర్తలను తమకిమ్మని అర్ధించారు.
కుమారులు తమ భార్యలతో సుఖంగా కాపురం ఉండటమే కదా ఏ తల్లి అయినా కోరేది. అనసూయ మాత అంగీకరించింది. అయితే ఆమెను ఆమె భర్త అత్రిని ఒక కోరికను కోరుకొమ్మన్నారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులు మాకు జన్మించవలెనని కోరుకున్నారు అత్రి అనసూయ దంపతులు. త్రిమూర్తులు తథాస్తు అని దీవించి తమ దేవేరులతో అంతర్థానమయ్యారు. ఆ మాట ప్రకారమే బ్రహ్మాంశ చంద్రునిగాను, విష్ణ్వాంశ శ్రీదత్తునిగాను, రుద్రాంశ దూర్వాసునిగాను జన్మించటం జరిగింది.
బ్రహ్మ, శివుడు తమ అంశలను దత్తాత్రేయునికి ఆవహింపచేసి వెళ్లిపోయారు. దత్తజయంతిని మార్గశిర పున్నమినాడు జరుపుతారు. ఇది 2018లో డిసెంబరు 22న వస్తుంది. మానవుని యొక్క ఔన్నత్యాన్ని దత్త ఆవిర్భావము వలన తెలుసుకొనవచ్చు. దత్త అవతారుడు మనుజులలో ఉత్తమ గుణాలను పెంపొందిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గురుదేవులుగా పిలువబడరు. కానీ, దత్త అవతారము గురుత్వమును ప్రబోధించునది. ఇంకను దత్త అవతారమును దైవంగా కూడా పూజించడం జరుగుతుంది. ఇన్ని అవతారాలున్నా, ఒకేచోట గురువు, దైవముగా ఆరాధింపబడే అవతారం దత్తావతారం.