Telangana
తెలంగాణలో ఆరు కొత్త విమానాశ్రయాలకు ప్రణాళిక
Kalinga Times,Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేరుగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించిన ప్రభుత్వం, కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లించేందుకు కూడా అంగీకరిందని సమాచారం. విమానాశ్రయాలు నిర్మించాలని భావించే ప్రాంతాల్లో సర్వే, తదితర పనుల నిమిత్తం మౌలిక వసతులు, పెట్టుబడుల విభాగం ఇప్పటికే రూ. 1.06 కోట్లను విడుదల చేసిందని విశ్వసనీయ సమాచారం. ఈ విమానాశ్రయాలు వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. వరంగల్ సమీపంలోని మామ్నూరులో, పెద్దపల్లికి సమీపంలోని బసంత్ నగర్ లో, నిజామాబాద్ సమీపంలోని జక్రాన్ పల్లిలో, ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరగా, ఖమ్మం సమీపంలోని కొత్త గూడెంలో, మహబూబ్ నగర్ సమీపంలోని అడ్డాకులలో ఇప్పటికే స్థలాలను గుర్తించినట్లు తెలుస్తోంది.