Kalinga Times,Hyderabad : ప్రగతిభవన్ లో మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశాన్ని ఏం అభివృద్ధి చేసి గెలిచారని కేసీఆర్ ప్రశ్నించారు. అసలు దేశంలో ఆయన పనితీరుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో అని ఏమైనా చెప్పాడా అంటే అది కూడా లేదన్నారు. ఎన్నికలనే యుద్ధం చేసి గెలిచారన్నారు. దేశభక్తి, జాతీయత అనే సెంటిమెంట్లను, భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచారని ఆరోపించారు. బీజేపీ లేకపోతే దేశానికి రక్షణ లేదని, భద్రత అసలే ఉండదని భ్రమ ప్రజలకు కల్పించి గెలిచాడని అది కూడా గెలుపా అంటూ విమర్శించారు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకీ బీజేపీ అసలు పోటీయే కాదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, శక్తివంతమైన పార్టీగా టీఆర్ఎస్ ఇప్పటికే అవతరించిందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేతలను సన్నద్ధం చేసేందుకు హిత బోధ చేశారు సీం కేసీఆర్. ఎన్నికలు, అభివృద్ధి అనే రెండు అంశాలు వేర్వేరు అని దేని దారి దానిదేనని చెప్పుకచ్చారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరబోతున్నట్లు తెలిపారు. ఉభయ సభలలో కొత్త మున్సిపల్ చట్టాన్నిఆమోదించుకున్న తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు.
ఆగష్టులో ఎన్నికలు ఉంటాయని పరిషత్ ఎన్నికల్లో ఎలా అయితే గెలిచామో అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ బ్రహ్మాండంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. ప్రతిపక్ష పార్టీలను గురి చూసి కొడితేనే విజయం సాధిస్తామన్నారు. ఎదుటి వాడి బలాలు బలహీనతలను అర్థం చేసుకుని విజయం దిశగా అడుగులు వేయాలంటూ క్లాస్ పీకారు. ఎక్కడ దెబ్బకొడితే విజయం సాధిస్తామో ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఇవే వ్యూహాలతో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరాలని సూచించారు.