Andhra Pradesh
తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా

Kalinga Times,Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎలా వెళ్లారంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను వెళ్లినా వెళ్ళక పోయినా స్విచాన్ చేసేవారన్నారు. అసలు ఈ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడే కట్టారనీ, అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాశారంటూ ప్రశ్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా స్పీకర్ వారికి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆల్మట్టి 524 మీటర్ల ఎత్తు పెంచితే చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఏం చేశారని, ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండని ఆయన అన్నారు. అపుడే ఇరు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో పయనిస్తాయన్నారు. తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా అంటూ జగన్ నిలదీశారు.