Kalinga Times,ముంబై: ముంబై నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఎన్డీఆర్‌ఎఫ్, నావికా దళ సిబ్బందిని రంగంలోకి దింపారు. మరో రెండు గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కుర్లా క్రాంతినగర్‌లోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం నుంచి సంభవించిన పలు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 44 మంది చనిపోయినట్లు సమాచారం.
రహదారులన్నీ జలదిగ్భంధంలో చిక్కుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతుంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమాన సేవలు సైతం స్థంభించి పోయాయి. ఇప్పటి వరకు దాదాపు 54 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు ముంబై విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి.
ప్రభుత్వం మంగళవారం సెలవు దినంగా ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యక్రమాల్ని రద్దు చేశారు. ముంబై విశ్వవిద్యాలయ పరిధిలో జరిగే అన్ని పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు తాగునీరు, ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గత పదేళ్లలో ముంబైలో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది.