Kalinga Times : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన కేడర్, నాయకుల్లో మనోధైర్యం నింపడంతో పాటు 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసేందుకు సిద్ధమయ్యే నాయకులెవరినైనా తీసుకుంటామని పార్టీలోని కీలక నేతలకు తెలియజేశారు.
కొత్త వారిని తీసుకునే విషయంలో మరికొంత సమయం వేచి చూద్దామని నేతల సలహా ఇచ్చారు. దీనిపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన నిర్ణయం కాదంటే కఠిన నిర్ణయాలేనన్న సేనాని,’పార్టీ పరిధి పెంచొద్దా..? ఎప్పుడూ మీరు, మీ వాళ్లేనా..? పార్టీలోకి కొత్త నీరు రావాలి. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమివ్వాలి. నా నిర్ణయాన్ని ఎవరైనా కాదు.. కుదరదంటే కఠిన నిర్ణయాలు ఉంటాయి. నాయకత్వ సమస్య వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం. 2014 ఎన్నికల సమయంలో నేనొక్కడినే ఉన్నాను. 2014 తర్వాత మీరు కొంత మంది వచ్చారు. 2024 ఎన్నికల్లోపు పార్టీ పరిధిని మరింత పెంచాలి. ఇప్పటి నుంచే ప్రజాదరణ ఉన్న నాయకులను తీసుకుంటే మంచిది. ఐదేళ్ల తర్వాత వారే పార్టీకి బలమైన నేతలుగా తయారవుతారు’ అని చెప్పుకొచ్చారు పవన్ . దీంతో సమావేశంలో ఉన్న నాయకులంతా మౌనంగా ఉండిపోయారని తెలిసింది. స్థానిక ఎన్నికలకు కేడర్‌ను, నేతలను సమరోన్ముఖులను చేసేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జూలై రెండోవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష జరుపుతారు.