Andhra Pradesh
అవినీతికి దూరంగా జగన్ సర్కార్
Kalinga Times : ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనని, అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక కట్టారంటూ సీఆర్డీఏ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనం అని, ఇల్లిdగల్ భవనంలో ఇంత మంది అధికారులం సమావేశమయ్యాం… వ్యవస్థ ఎలా దిగజారిందో తెలుసుకోవడానికే ఇక్కడికి పిలిపించానన్నారు.
ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా? అని ప్రశ్నించారు. చిన్నవాళ్లు ఇలాంటి తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటాం… మనమే తప్పు చేస్తే ఎలా? అని జగన్ ప్రశ్నించారు. మనం ప్రజలకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎల్లుండి నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుంచే ప్రారంభించాలన్నారు.
గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి ఎక్కడా ఉండకూడదన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిజాయితీతో పని చేయాలన్నారు. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలు అని, ఆ తర్వాత అంతా మనవాళ్లేనన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే సీఎంవోకు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులంతా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సమస్యలను అధికారులు పరిశీలించాలన్నారు.
ప్రజలకు మనం సేవలకులన్న విషయం ప్రతిక్షణం గుర్తుం డాలన్నారు. నవరత్నాలు మన మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియని పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాలన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. మన ప్రభుత్వం అంటే అధికారులు కూడా ఉంటారు… అందరం కలిసికట్టుగా పని చేస్తేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయగలమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే మేనిఫెస్టో చూపించి ఇవన్నీ పూర్తి చేశామని చెప్పగలగాలన్నారు.
రానున్న రోజుల్లో తన పాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి దూరంగా తమ సర్కార్ పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు వైఎస్ఆర్ కంటే తన పాలన ఇంకా బాగుందని ప్రజల నుండి మెప్పు పొందాలని జగన్ వాంఛగా కన్పిస్తోంది. ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.
రెండు రోజుల పాటు సాగే కలెక్టర్ల సమావేశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఇవాళ కేవలం కలెక్టర్లు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.