తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలపై చర్చించాం. ఏపీతో స్నేహపూర్వక, ఉల్లాసభరితమైన సంబంధాలు కొనసాగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. వివిధ అంశాలపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అభినందనీయం. ఇది తెలుగు ప్రజలందరికీ శుభవార్త. గతంలో కర్ణాటక, మహారాష్ట్రతో నిత్యం నీటి తగాదాలే ఉండేవి. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. కాళేశ్వరం పూర్తికావడానికి మహారాష్ట్ర పూర్తిగా సహకరించింది.
కరకట్టల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా భూమి ఇచ్చింది. శత్రుభావంతో ఉంటే మహారాష్ట్ర భూములిచ్చేది కాదు. కాళేశ్వరం 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరిస్తుంది. మొదటి దశలో 25 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. కాళేశ్వరంతో పారిశ్రామిక, తాగునీటి సమస్య తీరుతుంది. కాళేశ్వరం త్వరగా పూర్తి చేశారని మహారాష్ట్ర సీఎం అభినందించారు. కాళేశ్వరం తరహా త్వరగా తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. జల సమస్యల పరిష్కారం కోసం ఈనెలలో ఏపీ ప్రతినిధులు పర్యటించబోతున్నారు. రెండు రోజులు ఇక్కడ, ఒకరోజు ఏపీలో సమావేశమవుతాం. అవసరమైన చోట రాష్ట్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి.’’ అని అన్నారు.
‘‘ శ్రీశైలంలోకి సుమారుగా 1200 టీఎంసీల నీరొస్తుంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు కీచులాటలు పెట్టుకోవడం వల్ల ప్రజలు నష్టపోయారు. మనకు వస్తున్న 5వేల టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి తీసుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాం. దాని ఫలితాలను రాబోయే రెండేళ్లలో ప్రజలకు చూపిస్తాం. అన్ని రంగాల్లో గతంలో చూడని ఫలితాలను చూపించాలని నిర్ణయించుకున్నాం.
సచివాలయం, అసెంబ్లీ భవనాల అప్పగింత పూర్తికావొచ్చింది. గతంలో ఏపీ ప్రభుత్వం భవనాలు ఇవ్వమని మొండికేసింది. అందుకే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భవనాలు ఇవ్వడం వల్ల తెలంగాణకు మంచి జరిగింది. కొత్తగా సచివాలయం, అసెంబ్లీ నిర్మించాలని నిర్ణయించాం. ఇప్పుడున్న చోటే సచివాలయం నిర్మిస్తాం. రూ.400కోట్లతో సచివాలయం, రూ.100కోట్లతో అసెంబ్లీ నిర్మాణం. ఎర్రమంజిల్ కాంప్లెక్స్‌లో అసెంబ్లీ, మండలి నిర్మాణం. ఇప్పుడున్న అసెంబ్లీ ఎలివేషన్‌తోనే కొత్త అసెంబ్లీ నిర్మాణం. ప్రస్తుత అసెంబ్లీని అలాగే ఉంచుతాం. ఈనెల 25న సచివాలయం, అసెంబ్లీ భవనానికి భూమిపూజ. భవనాల నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ మంత్రితో కమిటీ వేస్తాం. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించాం.’’ అని అన్నారు.