Andhra Pradesh
డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి పెనుప్రమాదం తప్పింది
విజయనగరం: డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె సొంత జిల్లా విజయనగరంకు వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, ఇతర సామాన్య ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికాలని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా రాజాపులోవ దగ్గర ఆమె స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యేలు. అక్కడ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆమె భర్త పరీక్షిత్ రాజుకు స్థానిక నేతలు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాజాపులోవలో బహిరంగ సభను కూడా నాయకులు ఏర్పాటు చేశారు. పుష్పశ్రీవాణి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఇక వేదికపైకి చేరుకున్న ఆమెను అభినందించేందుకు నాయకులు నేతలు స్టేజీ ఎక్కారు. అందరూ స్టేజ్ ఎక్కడంతో ఆ వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అలర్ట్ అయిన పుష్పశ్రీవాణి భద్రతా సిబ్బంది ఆమెను ఆమె భర్త పరీక్షిత్ రాజును పక్కకు తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే వేదిక కూలడంతో అంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.