Andhra Pradesh

జనసేనకు టెన్ ప్లస్

లగడపాటి లెక్కలు

విజయవాడ, ఏప్రిల్ 27, (Local News India)
ఇపుడు ఏపీలో మూడు బలమైన సామాజిక వర్గాలకు మూడు పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ కాదు… బలమైన అనే పదం మీరు గుర్తించాలి. ఎందుకంటే గత 30 ఏళ్లుగా రెండు మూడు సంవత్సరాలు ఏలిన రోశయ్య మినహా మిగతా ముఖ్యమంత్రులు అందరూ రెడ్డి లేదా కమ్మ కులస్థులు మాత్రమే.తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలు రాష్ట్రంల ముఖ్యమంత్రులను తారుమారు చేసేటంతటి ప్రభావవంతమైన జిల్లాలు. అయితే ఈ జిల్లాల్లో కాపులు ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల ఐటీ రంగంలో కూడా వీరి సంఖ్య బాగా పెరగడం, వాణిజ్య పంటల ఆదాయం పెరగడం వంటి కారణాల వల్ల కాపులు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. దీంతో వారిలో బలమైన అధికార కాంక్ష పెరిగిన మాట కూడా నిజమే. వాస్తవానికి చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినపుడు రామోజీరావు కూడా చిరంజీవి బాగా ఎదగలడు అని నమ్మాడు. అందుకే ఈనాడు ద్వారా బాగా ప్రయారిటీ ఇచ్చారు. అయితే, ఎన్నికలకు ముందే ఆ పార్టీ బలహీన పడిపోయింది. అయినప్పటికీ 18 సీట్లు సాధించగలిగింది. పెద్ద సంఖ్యలో ఓట్లు తెచ్చుకోగలిగింది. చిరంజీవి అలాగే కొనసాగి ఉంటే… 2014లో హంగ్ ద్వారా అయినా సీఎం అయ్యుండే వాడేమో. చెప్పలేం. సీఎం అయినా కాకపోయినా రాజకీయాల్లో కింగ్ మేకర్ మాత్రం అయ్యేవాడు. తొందరపాటు వల్ల చాలా పోగొట్టుకున్నాడు. దీంతో అతని మీద ఫెయిల్ అనే ముద్ర పడింది. పవన్ రాజకీయ ప్రవేశంపై పెద్ద ఆసక్తి కనపడలేదు. పైగా అతను రావడం రావడమే పొత్తుతో రావడంతో జనం ఆలోచించారు. అనుకున్నంత మద్దతు అయితే పవన్ కు దొరకలేదు. అయితే, ఏ మాటకు ఆ మాటే… పవన్ మిగతా వాళ్లకు భిన్నం. అందుకే అన్న ఫెయిలయినా కూడా జనంలో అతనికి క్రేజ్ అయితే భారీగా ఉంది. మే 23 వస్తే గాని వాస్తవం ఏంటో తెలియదు కాకపోతే చాలా సర్వేలు పవన్ ప్రభావం లేనట్లే చెబుతున్నాయి. 5 సీట్లు వస్తే బాగా వచ్చినట్టు అని ఫీలవుతున్నాయి. ఇదొక కోణం.మరో యాంగిల్లో చూస్తుంటే… అందరి అంచనాలను జనసేన తలకిందులు చేసే అవకాశం ఉందంటున్నారు. ఓట్ల శాతంలో గాని, సీట్ల శాతంలో గాని బయట జరుగుతున్న ప్రచారం కంటే ఎక్కువ ప్రభావమే చూపొచ్చు అంటున్నారు. సైలెంట్ వేవ్ ఉందంటున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ లాగే… పవన్ ఒకటైపు మొండివాడు కావడం వల్ల అతనికి కొంత బలమైన వర్గం ఏర్పడి ఉండొచ్చంటున్నారు. అందుకే కుల పరంగానే కాకుండా ఇతర కోణాల్లో కూడా పవన్ కు రాజకీయ లాభం చేకూరి ఉండొచ్చని ఒక అంచనా. ఇది నిజమేనేమో అన్నట్లు తాజాగా ఒక ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియో లగడపాటి సర్వే టీంలో ఓ సభ్యుడు- జనసేన అభిమాని మాట్లాడుకుంటున్న ఆడియో అంటున్నారు. ఆ లీకైన ఆడియో ప్రకారం జనసేనకు 14 – 22 సీట్లు వస్తాయని లగడపాటి సర్వేలో తేలినట్లు ఈ కాల్లో తెలుస్తోంది. మరి దీని అథెంటిసిటీ ఏంటో తెలియదు గాని… ఏమో గుర్రం ఎగరా వచ్చునేమో.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close