Telangana
రేవంత్ టార్గెట్ గా కేటీఆర్
హైదరాబాద్, మార్చి 23 (Local News India)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డిని ఓడించడంలో టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు కీలకపాత్ర పోషించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రత్యర్థుల ఓటమి కోసం పక్కాగా ప్లాన్ చేసే హరీశ్ రావు… రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కొద్దిరోజుల ముందు నుంచే వ్యూహాలు రచించారని టాక్ వినిపించింది. టీఆర్ఎస్, హరీశ్ రావు వ్యూహాలు ఫలించడంతో… కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పలేదు. అయితే కొడంగల్ ఓటమికి మల్కాజ్ గిరిలో గెలిచి టీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి… మరోసారి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు.మల్కాజ్ గిరి లోక్ సభ బరిలో గెలిచి కాంగ్రెస్‌లో తన ఇమేజ్ పెంచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… మల్కాజ్ గిరిలో ఈ సారిని రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి పరిధిలోని నియోజకవర్గాల్లో ఎక్కువశాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టిన కేటీఆర్… మల్కాజ్‌గిరి పరిధిలోనూ మరోసారి అదే రేంజ్‌లో ప్రచారం చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.రేవంత్ రెడ్డిని మల్కాజ్ గిరిలో ఓడిస్తే…మరో నాలుగేళ్ల పాటు అతడు సైలెంట్ అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కారణంగానే మరోసారి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో అందుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని గులాబీ పార్టీ గట్టిగా డిసైడయినట్టు తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్… లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయనకు ఝలక్ ఇస్తుందేమో చూడాలి.