National

లోక్‌సభ సమరానికి ఎన్నికల షెడ్యూలు

Local News India : లోక్‌సభ సమరానికి ఎన్నికల కమిషన్‌ నగారా మోగించింది. ఎన్నికలకు ఆదివారం షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్‌ 11న మొదలయ్యే ఎన్నికలు.. 39 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగి.. మే 19న ముగుస్తాయి. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది. జూన్‌ 3వ తేదీతో ప్రస్తుత లోక్‌సభ కాల పరిమితి ముగియనుంది. ఆలోపులోనే ఎన్నికల ప్రక్రియను ఈసీ ముగించనుంది. గత (2014) ఎన్నికలు తొమ్మిది దశల్లో జరగగా.. ఈసారి ఏడు దశలకే ఈసీ పరిమితం చేసింది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి, తెలంగాణ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడంతో గత ఏడాది డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ, పీడీపీ సంకీర్ణం విడిపోవడంతో గత ఏడాది నవంబరు 21వ తేదీన జమ్మూ కశ్మీరు అసెంబ్లీ రద్దయింది. ప్రస్తుతం అక్కడ గవర్నర్‌ పాలన నడుస్తోంది. ఆరు నెలల్లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ఎన్నికల కమిషన్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడ కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇక, బిహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, గోవా, మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయ, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 39 అసెంబ్లీ స్థానాలకూ ఈ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు జరుగుతాయి. నిర్వాచన్‌ సదన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఆదివారం నుంచే దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వస్తుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికల నిర్వహణకు 10 లక్షల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు లక్ష పోలింగ్‌ స్టేషన్లను అదనంగా నెలకొల్పుతున్నామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా అన్ని ఈవీఎంలకూ వీవీప్యాట్లను అమరుస్తున్నామని తెలిపారు. ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సహా 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని, ఓటరు స్లిప్పులు గుర్తింపు కాబోదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షల షెడ్యూలును పరిగణనలోకి తీసుకునే ఎన్నికల తేదీలను ఖరారు చేశామని చెప్పారు. కోడ్‌ అమల్లోకి వచ్చినందున ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు ఏవీ తీసుకోరాదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో రాజకీయ అడ్వర్టైజ్‌మెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

రెండు దశల్లో పోలింగ్‌
కర్ణాటక: ఏప్రిల్‌ 18, 23
మణిపూర్‌: ఏప్రిల్‌ 11, 18
త్రిపుర: ఏప్రిల్‌ 11, 18
రాజస్థాన్‌: ఏప్రిల్‌ 29, మే 6

మూడు దశల్లో పోలింగ్‌
అసోం: ఏప్రిల్‌ 11, 18, 23;
ఛత్తీస్‌గఢ్‌: ఏప్రిల్‌ 11, 18, 23

నాలుగు దశల్లో పోలింగ్‌
మహారాష్ట్ర: ఏప్రిల్‌ 11, 18, 23, 29
ఒడిసా: ఏప్రిల్‌ 11,18, 23, 29
జార్ఖండ్‌: ఏప్రిల్‌ 29, మే 6, 12, 19

అయిదు దశల్లో పోలింగ్‌
జమ్మూ కశ్మీరు: ఏప్రిల్‌ 11, 18, 23, 29, మే 6

ఏడు దశల్లో పోలింగ్‌
బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌:
ఏప్రిల్‌ 11, 18, 23, 29, మే 6, 12, 19

ఏ దశలో ఎన్ని రాష్ట్రాలు.. ఎన్ని నియోజకవర్గాలు
మొదటి దశ: 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాలు
రెండో దశ: 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు
మూడో దశ: 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాలు
నాలుగో దశ: 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాలు
ఐదో దశ: 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలు
ఆరో దశ: 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు
ఏడో దశ: 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close