social
సర్వాంగ సుందరంగా వారణాసి ఆలయం
లక్నో, మార్చి 8 (Local News India)
వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా కీలక అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాశీలో కొలువైన బోలా శంకరుడి విశిష్టత, ఆ పవిత్ర స్థలంతో తనకున్న అనుబంధాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరీకరణ, సౌందర్యీకరణ’ పేరుతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథ్ ఆలయంపై శత్రువులు ఎన్నోసార్లు దాడులు చేశారని.. అయినప్పటికీ బోలే బాబా మహాత్యం వల్ల ఆలయ ప్రభ ఏమాత్రం తగ్గలేదని మోదీ చెప్పారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రాక ముందు నుంచే కాశీ విశ్వనాథుడి ఆలయానికి వస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ పవిత్ర ఆలయం కోసం ఏదో చేయాలనే తపన ఆనాడే పుట్టిందని చెప్పారు. శంకరుడి దయతో తన కల నేటికి సాకారం అవుతోందని అన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్గా పేర్కొంటున్న ఈ అభివృద్ధి పనుల్లో ఆలయ విస్తరణ, సుందరీకరణతో పాటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించారు. సందర్శకులకు అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ సుందరీకరణ తర్వాత కాశీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహకారం లేకపోతే కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ కోసం తలపెట్టిన మహత్కార్యం కార్యరూపం దాల్చకపోయేదని ప్రధాని పేర్కొన్నారు. ఆలయ బృందం కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం వారణాసికి చేరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్, సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని అక్కడి నుంచి నేరుగా వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయం పేరు మీదుగా 5 ఇటుకలు పేర్చిన ప్రధాని.. అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధిని చేపట్టనున్నారు.