ఈనాటికి రోడ్లపై నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇంకా ఎండమావే!
భద్రమనుకునే ఇండ్లలోనూ అదే హింస! అయినా సహనానికి మారుపేరు..
తన బతుకు మారే రోజుకోసం ఓపికగా ఎదురుచూస్తున్నది. ఆటంకాలెన్ని ఎదురైనా.. తలవంచక..
పురుషాధిక్య సమాజానికి సవాలు విసురుతున్నది!
అనేక విజయాలూ తన సిగలో దోపుకుంటూనే వున్నది!
మహిళ..మానవతామూర్తి..
మహోన్నత భావాలు కలగలసిన వ్యక్తి..కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన శక్తి..కడుపు నింపే తల్లిగా, బాధ్యతను పంచుకునే అక్కగా.. ప్రేమను పంచుకునే చెల్లిగా, మనసుకు నచ్చిన ప్రియురాలుగా, మమతలను పంచే అనురాగవల్లిగా.. ఇలా ఆమె సేవలు ఋణం తీర్చుకోలేనివి. అందుకే పురాతన కాలం నుంచి నేటివరకు మన సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారు. వారిని దేవతలా భావించి పూజిస్తున్నారు. ఇక్కడ పుట్టిన నదీనదాలను, చెట్లను కూడా తల్లిలాగానే గౌరవిస్తున్నాం. మన దేశాన్ని కూడా భారతమాత అని తల్లిలా గౌరవించి భావించి పూజిస్తున్నాం. మన పురాతన సంప్రదాయంలో మహిళను మాతృమూర్తిగా గౌరవించాం. కానీ నేడు స్త్రీ ని కేవలం ఒక భోగ వస్తువుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎపుడైతే ప్రతి మహిళను తల్లిగా చూసి, ఆమెకు సమాజంలో పరిపూర్ణ గౌరవాన్ని కల్పించే రోజు వస్తుందో అప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధించినట్లు లెక్క. ఈ మార్పు రానంతవరకు దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించలేదనేది అక్షరసత్యం. ఆకాశంలో సగంగా వున్న మహిళలు సగర్వంగా తలెత్తి ఆశాభావంతో తమ భవిష్యత్తు మరింత దేదీప్యమానమవ్వాలని హృదయపూర్వకంగా జాతి, మత, కుల, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాల్ని మరచి ఒకే వేదికపైకి చేరే రోజు మహిళా దినోత్సవం.
ఈ రోజు సాధికారిత.. సమానత్వం దిశగా అడుగులు వేసే మహిళల గురించే ప్రస్తావించే సందర్భం.
నేటికీ మేటి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో.. ఇందులో భారతీయ మహిళ కూడా తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలూ కృషి చేస్తూనే వుంది. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాలనే సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే నేటి మహిళకి ఆదర్శం. వివక్ష, అసమానతల్లాంటివి వెనక్కి లాగుతున్నా తన జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్నా తరుణి పట్టుదలగా ముందుకు సాగిపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అతివలు సాధిస్తున్న అనితర విజయాలు మరెందరికో వెలుగుబాటలవుతున్నాయి.
దేశ విదేశాలలో బయట ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా..గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని స్త్రీ ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు. స్త్రీ అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘స’కారము సత్వగుణానికి, ‘త’కారము తమోగుణానికి, ‘ర’కారము రజోగుణానికి ప్రతీకలు. అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా స్త్రీ ని పేర్కొనవచ్చు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ ఉత్తమ సంతానం కలుగుతుంది.