న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26, (LOCAL NEWS INDIA)
మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన పడగ విప్పింది. 3.30 గంటల సమయంలో నియంత్రణరేఖ దాటి దాడులు జరిపింది. అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసింది. శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాలు వేటకు బయలుదేరాయి. ముందుగా బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.53 గంటల మధ్య తొలి దాడి జరిగింది. తరువాత మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3.48 గంటల నుంచి 3.58 గంటల మధ్య దాడులు జరిగాయి. చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3.58 నుంచి 4.04 గంటల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4.12 నుంచి 4.15 గంటల కెల్లా అన్ని విమానాలూ సురక్షితంగా ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. ఒక్క దాడితో జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్లో అత్యధికులను తుదముట్టించింది. భారత సైన్యం జరిగిన రెండో విడత సర్జికల్ స్ట్రయిక్స్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. మరోవైపు భారత వాయిసేన దాడులపై పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ ఐఎఎఫ్ జారవిడిచిన బాంబులు బహిరంగ ప్రదేశంలో పడ్డాయని, దానివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కాని, భవనాలకు నష్టం కాని జరుగలేదని చెప్పారు.