Telangana
ఈఎన్టీ పరీక్షలపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, డిసెంబర్ 03(లోకల్ న్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఫిబ్రవరి నుండి చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు సంబంధించి తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య రంగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో మాణిక్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలి వెల్పేర్ యోగితారాణా, వైద్య విద్యా సంచాలకుడు రమేష్ రెడ్డి, అలగు వర్షిణి, ప్రజా వైద్యం, కుటుంబ సంక్షేమం సంచాలకులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య రంగానికి అత్యధిక ప్రాముఖ్యత నిస్తామని తెలపారని, ప్రజలందరికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. వచ్చే నెలనుండి ప్రారంభించవలసిన చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన ఏర్పాట్లు, వైద్యనిపుణుల అందుబాటు, వినికిడి పరికరాలు, నిధుల అవసరం, వైద్యసేవలకు వచ్చే ప్రజల సంఖ్య, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. చెవి, ముక్కు,గొంతు, దంత పరీక్షలకు వచ్చే వారి సంఖ్యను అంచనా వేయాలన్నారు. వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి ఫైలట్ పద్దతిలో క్యాంపులు నిర్వహించి అవగాహనకు రావాలన్నారు. వైద్య శిబిరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య పరీక్షలకు సంబంధించి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి ప్రయివేటు ఆసుపత్రులు తమ సమాచారాన్ని ఫీడ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులపై నివేధిక సమర్పించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకోసం అవసరమైన నిపుణులైన డాక్టర్ల సంఖ్యను అంచనా వేయాలన్నారు. వివిధ వయసుల వారికి వచ్చే వ్యాదులపై విశ్లేషణ చేయాలన్నారు. వైద్యశాఖలో రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభావాన్ని అంచనా వేయాలన్నారు.