Telangana
ఆన్ లైన్ లో డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు
హైద్రాబాద్, జనవరి 3, (లోకల్ న్యూస్)
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకోండి… ఆన్‌లైన్‌లో మీ పేరు నమోదు అవుతుంది.. తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తాం..
మీ సేవలో చెల్లించిన రూ. 35ల రశీదు మీ వద్ద ఉంటే సరిపోతుంది. ఒకసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టు తిరగాల్సి అవసరం లేదు.. అని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా చాలా మంది దరఖాస్తుదారులు ఇంకా అయోమయంలోనే ఉన్నారు. మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసిన పత్రాలను, రశీదులను పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వేలాది మంది దరఖాస్తు దారులు డబుల్ బెడ్ రూం పత్రాలతో క్యూ కట్టారు. గురువారం కూడా కలెక్టర్ కార్యాలయానికి పోటేత్తారు. వీరిని అధికారులు నచ్చ చెప్పి పంపించారు. అయితే ఇక్కడ దరఖాస్తు దారులు ఒకటి గుర్తించుకోవాలి. తమ పూర్తి వివరాలను పూర్తిగా మీ సేవల ద్వార ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నాక మీకు ఓక రశీదు ఇస్తారు. దానిని మీరు భద్రంగా మీవద్ద ఉంచుకుంటే సరిపోతుంది. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఆన్‌లైన్ ద్వార దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరి దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నరగంలోని మండలాల వారిగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరలోనే చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. డబుల్ ఇండ్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలను సేకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం నుండి వచ్చే మార్గదర్శకాల ప్రకా రం ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాం గం చర్యలు చేపట్టనుంది.డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ప్రజలు ఎవరూ దళారుల చేతిలో మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని చెప్పే దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికను జిల్లా యంత్రాంగం పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొంటున్నారు. మీ సేవా కేంద్రాలలో కేవలం 35 రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఎవరూ కూడా ఒకసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాక తిరిగి మరలా మండల, ఆర్టీవో, జిల్లా కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలసిన అవసరం లేదంటున్నారు అధికారులు.