Andhra Pradesh

ఇంధనం, మౌలిక రంగాలపై శ్వేతపత్రం

అమరావతి, డిసెంబర్ 29, (లోకల్ న్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టాప్ ఐదు  రాజధానుల్లో ఒకటిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలపై శనివారం  ఏడో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ఫేజ్-1 నిర్మాణానికి రూ.51వేల కోట్లు, రెండో ఫేజ్ కు మరో రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
రూ.40వేల కోట్ల పనులు అమరావతిలో ప్రారంభమయ్యాయన్నారు. శనివారం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఇంధనం, అమరావతి సహా మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రహదారులు-భవనాలు, ఆర్థిక నగరాలపై వివరాలు వున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన విభాగం మౌలిక రంగం. 615 పురస్కారాలపై సమాచార శాఖ తీసుకొచ్చిన పుస్తకం ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలపై కరదీపిక అని అన్నారు.
ఇంధనం, అమరావతి సహా మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రహదారులు-భవనాలు, ఆర్థిక నగరాలపై ఈ శ్వేతపత్రమని అన్నారు. 1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. తొలిసారిగా ప్రైవేట్ రంగంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చాయి. ఈ సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నాం. 2004 నుంచి 2014 వరకు దశాబ్దం పాటు విద్యుత్ రంగంలో చీకట్లు నెలకోన్నాయని అన్నారు. ఆ తరువాత అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల విద్యుత్ రంగం మరింత కష్టాల్లోకి నెట్టబడింది.
2014 జూన్ నాటికి రాష్ట్రంలో రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది.   2014లో సౌర విద్యుత్ ధర యూనిట్కు రూ.6.50 ఉంటే, 2018 నాటికి రూ.2.70కి చేరింది. 2013-14లో మొత్తం విద్యుత్లో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 1.85% మాత్రమే సమకూరగా, ఇప్పుడు అది 22%కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 31,725 సౌర విద్యుత్ పంపుసెట్లను అమర్చారని అయన అన్నారు. అనంతపురం, కడప, కర్నూలులో మొత్తం కలిపి 4000 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ పార్కులను ఏర్పాటుచేస్తున్నాం. అందులో ఇప్పటికే 1850 మెగావాట్లు అందుబాటులోకి వచ్చాయి.
కర్నూలు సోలార్ పార్కు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు. ఇక్కడ 1000 మెగావాట్లు అందుబాటులోకి వచ్చాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంపై ఇప్పటివరకు పెట్టుబడులు రూ.36,604. 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు చెందిన యువత ప్రయోజనాలు పొందారు.  సుజ్లాజ్, గమెసా, రీజెన్ వంటి విద్యుత్ తయరీ ఉపకరణాల సంస్థలు ఏపీలో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటుచేశాయని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ఇంధన సంరక్షణ, పొదుపును ప్రోత్సహిస్తున్నాం. రాష్ర్టవ్యాప్తంగా అన్ని ఇళ్లకు 2.2 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీచేశాం. 110 మునిసిపల్ పట్టణాలలో 6.23 లక్షల ఎల్ఈడీ వీధి బల్బులను అమర్చాం. గ్రామాలలో ఇప్పటికే 20 లక్షల వీధిలైట్లను అమర్చాం. జనవరి నాటికి అన్ని వీధి లైట్లను ఎల్ఈడీలతో మార్చేస్తాం. పెట్టుబడి లేకుండా 30 శాతం విద్యుత్ ఆదాను ఈవిధంగా సాధించగలిగాం. గృహ అవసరాలకు 2.84 లక్షల ఇంధన సమర్ధత ఫ్యాన్లు, 1.42 లక్షల ఎల్ఈడీ ట్యూబ్లైట్లను పంపిణీచేశాం.
ఇంధన సమర్ధత లేని 44,814 వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో ఇంధన సమర్ధత కలిగిన ISI పంపుసెట్లను అమర్చామని అన్నారు. 2013-14లో 14%గా ఉన్న విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2018 నవంబరు నాటికి 9.7%కి తగ్గించాం. ఇది దేశంలోనే అతి తక్కువ. జగజ్జీవన్ జ్యోతి పథకం కింద 18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
2018-19 సంవత్సరానికి విద్యుత్ రంగానికి రాయితీల కింద రూ.6,030 కోట్లు కేటాయించాం. 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు 137 పురస్కారాలు వచ్చాయి.  2020 వరకు విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీనే నని అయన అన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close