Andhra Pradesh
గెలుపు గుర్రాలు కోసం జగన్ పాట్లు
విశాఖపట్టణం, డిసెంబర్ 29, (లోకల్ న్యూస్ )
మొత్తానికి జగన్ అనుకున్నట్లుగానే గెలుపు గుర్రాలను ఎంపిక చేసే
పనిలో పడ్డారు. అర్ధబలం, అంగబలం చూసుకుని మరీ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నారు. విశాఖ ఎంపీ సీటుకు ఎంవీవీ సత్యనారాయణ
అనే రియల్టర్ కి జగన్ టికెట్ కేటాయించారన్న
వార్త ఇపుడు బాగా ప్రచారంలో ఉంది.
పార్టీలో అయన చేరి గట్టిగా ఆరు నెలలు కూడా కాలేదు. జగన్ గోదావరి జిల్లాల టూర్లో ఉండగా ఆయన జగన్ని అక్కడ కలసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ విశాఖ పాదయాత్రను దగ్గరుండి విజయవంతం చేశారు. దానికి ప్రతిఫలంగా ఎంపీ టికెట్ దక్కబోతోందని అంటున్నారు.జగన్ ఆర్ధిక, అంగ బలాలు చూసుకుని టికెట్ కేటాయించాలనుకున్నా రెండు మైనస్ పాయింట్లు ఎంవీవీ కి ఉన్నాయాని అంటున్నారు. ఆయన స్థానికుడు కాకపోవడం, జనానికి పెద్దగా తెలియక పోవడం మైనస్ అవుతాయని అంటున్నారు. ఎంవీవీ సత్యనారాయణ ఈ మధ్యనే జనంలోకి వెళ్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పాతిక లక్షల మంది జనాభా కలిగిన విశాఖ ఎంపీగా గెలవాలంటే జనంలో మంచి పరిచయాలు ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంలో గెలిచిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నా వారికి పాపులరిటీ బాగా ఉందని అంటున్నారు. విశాఖ వాసులకు అయితే కమ్మ, లేకపోతే రెడ్డి అన్నట్లుగా విభజించి మరీ ప్రధాన పార్టీలు ఎంపీ టికెట్లు ఇస్తున్నాయి. గెలుస్తున్న వారు కూడా వారే అవుతున్నారు. విశాఖ ఎంపీ నియోజకవర్గంలో యాదవులు, కాపులు, బ్రాహ్మణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయా సామాజిక వర్గ సమతూకాలను పాటించకపోతే విజయావకాశాలపై గట్టిగా ప్రభావం పడుతుందని అంటున్నారు. గతంలో వైఎస్ విజయమ్మను దించి వైసీపీ అందువల్లనే భారీ పరాజయాన్ని మూటకట్టుకుందని గుర్తుచేస్తున్నారు. ఇపుడు కేవలం అర్ధబలం చూసుకుని టికెట్ ఇస్తే జనం ఎందుకు గెలిపిస్తారన్న ప్రశ్న కూడా ఉంది. మరి తొందరలోనే జగన్ ఎంవీవీ అభర్ధిత్వం పై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.